03-02-2026 12:52:02 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మహానగర ప్రజలను దోమల బెడద నుంచి, రోగాల బారి నుంచి కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఎంటమాలజీ కార్మికుల జీవితాలు అగమ్యగో చరంగా మారాయి. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను భుజాన వేసుకున్న ఈ కార్మికుల రక్తాన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీలు జలగల్లా పీల్చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, ఏజెన్సీల ఆడిందే ఆటగా సాగుతున్న వ్యవహారంలో సుమారు 200 మంది నిరుపేద కార్మికులు ప్రతినెలా నిలువు దోపిడీకి గురవుతున్నారు.
జీతం లెక్కల్లో భారీ గండి
జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వం స్పష్టమైన వేతన నిబంధనలను రూపొందించింది. దీని ప్రకారం ఒక్కో ఎంటమాలజీ కార్మికుడికి నెలకు రూ.20,930 వేతనం చెల్లించాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఏజెన్సీలు కార్మికులకు కేవ లం రూ.9 వేలు మాత్రమే చెల్లిస్తున్నాయి. మిగిలిన రూ.11,930 మొత్తాన్ని ఏజెన్సీలు అక్రమంగా మింగేస్తున్నాయి. అంటే సగానికి పైగా జీతాన్ని కోసేసి, కార్మికుల కష్టార్జితాన్ని దారి మళ్లిస్తున్నారు. కేవలం 200 మంది కార్మికుల నుంచే ప్రతినెలా లక్షల రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతోంది.
జీహెచ్‌ఎంసీకి మాత్రం ఫుల్ బిల్లులు
కార్మికులకు చాలీచాలని జీతాలు ఇస్తున్న సదరు ఏజెన్సీలు, జీహెచ్‌ఎంసీ అధికారుల వద్ద మాత్రం పూర్తి స్థాయి బిల్లులను క్లెయిమ్ చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రికార్డుల్లో ఒక్కో కార్మికుడికి రూ. 20,930 చెల్లిస్తున్నట్లు చూపిస్తూ, కార్పొరేషన్ ఖజానా నుంచి పూర్తి మొత్తాన్ని డ్రా చేసుకుంటున్నట్లు సమాచారం. అధికారులు బిల్లులు మంజూరు చేసే సమయం లో కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్న వాస్తవ మొత్తాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఏజెన్సీలు, కొందరు అధికారుల కుమ్మక్కుతోనే ఈ వ్యవహారం నడుస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తక్కువ జీతం ఎందుకు ఇస్తున్నారని కార్మికులు నిలదీస్తే.. ఏజెన్సీల నిర్వాహకులు ఒక వింత వాదనను తెరపైకి తెస్తున్నారు. తాము జీహెచ్‌ఎంసీ టెండర్లను లెస్ పర్సంటేజీకి దక్కించుకున్నామని, అందుకే తక్కువ జీతాలు ఇస్తామని చెపుతున్నారు.
అయితే చట్ట ప్రకారం కాంట్రాక్టర్ ఎంత తక్కువకు టెండర్ వేసినా, అది వారి నిర్వహణ ఖర్చులు, లాభాల్లో చూసుకోవాలి తప్పా కార్మికుడికి అందాల్సిన కనీస వేతనంలో కోత విధించే అధికారం ఏజెన్సీకి లేదు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా, అమాయక కార్మికులను మభ్యపెడుతూ ఏజెన్సీలు తమ జేబులు నింపుకుంటున్నాయి.
ప్రశ్నిస్తే వేటు.. భయంతో మౌనం
న్యాయం కోసం, తమ హక్కుల కోసం గొంతెత్తిన వారిపై ఏజెన్సీలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయి. జీతాల విషయంపై ప్రశ్నించిన పలువురు కార్మికులను ఇప్పటికే ఎలాంటి కారణం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించారు. దీంతో ఉపాధి పోతుందన్న భయంతో మిగతా 200 మంది కార్మికులు మౌనంగా వెట్టిచాకిరీ చేస్తున్నారు.
పెరిగిన నిత్యావసర ధరల నేపథ్యంలో రూ.9 వేలతో కుటుంబాలను ఎలా పోషిం చుకో వాలని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ కమిషనర్, విజిలెన్స్ అధికారులు స్పందించి, సంబంధిత ఏజెన్సీల రికార్డులను తనిఖీ చేసి, తమకు న్యాయం చేయాలని కార్మికులు వేడుకుంటున్నారు.