03-02-2026 01:30:32 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ‘చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే.. మొత్తం సమాజానికి ఇచ్చినట్లేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఉద్యమకారుడిని ఇలా అవమానిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అసలు సిసలు ఉద్యమకారులకు, స్వయం ప్రకటిత నాయకులకు చాలా తేడా ఉంది. ఈ మధ్య కాలంలో కొందరు తమకు తామే తెలంగాణ జాతిపిత అని టైటిళ్లు ఇచ్చుకుంటున్నారు.
ఉద్యమకారుడు అనే పదాలనూ వారే రాసుకుంటున్నారు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరోక్షంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రావి నారాయ ణరెడ్డి మెమోరియల్ ఆడిటోరియంలో రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్‌రెడ్డికి సీఎం ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆనాటి జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శంగా నిలబడ్డారు. 30 ఏళ్లు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొట్లాడారు. ఆయన తన కుటుంబం కోసం ఏమైనా అడిగారా.. పదవులు తీసుకున్నారా.. స్వాతం త్య్రం వచ్చిన ఏడాదికే చనిపోయారు. కానీ నేడు జాతిపిత అని చెప్పుకునేవారు కుటుం బం కోసమే ఆరాటపడుతున్నారు. ఆస్తులు కూడబెట్టడమే పనిగా పెట్టుకున్నారు’ అని విమర్శించారు.
‘నిజమైన ఉద్యమకారుడు కోదండరాం. రాజకీయ పార్టీలు విఫలమైనప్పుడు జేఏసీ చైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరాంను ముందు పెట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నాం’ అని సీఎం గుర్తు చేశారు. ఆర్‌ఎస్యూ నుంచి ఆర్‌ఎస్‌ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు, కుల, మత సంఘాలను, చివరకు భిక్షగాళ్లను, రిక్షా డ్రైవర్లను కూడా జేఏసీ గొడుగు కిందకు తెచ్చి ఉద్యమాన్ని నడిపించిన కోదండరాం నిజమైన ఉద్యమకారుడు అని కొనియాడారు.
తాను ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లినప్పటికీ తెలంగాణ రాజకీయాలను గమనిస్తూనే ఉన్నానని రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘నేను అక్కడ ఒక క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా క్లాసులు నేర్చుకోవడానికి వెళ్లాను. అక్కడి క్లాసుల గురించి నారాయణ కూడా నన్ను అడిగారు. అయితే నేను అక్కడ ఉన్నా.. ఇక్కడి రాజకీయాలపై ఒక కన్ను వేసి ఉంచాను. రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలు వింతకు దారితీస్తున్నాయనిపిం చింది’ అని వ్యాఖ్యానించారు.
‘జైపాల్‌రెడ్డితో నాకు రాజకీయ సంబంధాలు తక్కువే. 2014 ఎంపీ ఎన్నికల్లో ఆయన కేవలం 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడానికి ఒకరకంగా నేనే కారణం. 2019లో ఆయన్ను పోటీ చేయాలని కోరాను. గత తప్పిదాన్ని సరిదిద్దుకుంటానని చెప్పాను. కానీ ఆయన పోటీకి దూరంగా ఉండి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. ఆయన నన్ను ఎప్పుడూ దూషించలేదు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఈ తరం నాయకులకు ఆదర్శం’ అని అన్నారు.
500 ఎకరాలు పంచిన మహనీయుడు రావి
తమ ప్రభుత్వం రావి నారాయణరెడ్డి స్ఫూర్తితోనే పనిచేస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించే అవకాశం దక్కించుకున్న ఘనత రావి నారాయణరెడ్డిదని, ఆయన తనకు వారసత్వంగా వచ్చిన 500 ఎకరాలను పేదలకు పంచారని సీఎం గుర్తు చేశారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి తొలి అవార్డు ఇవ్వడం ద్వారా అవార్డుకే గౌరవం దక్కిందన్నారు.
అనంతరం జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాజ్యాంగం, భావప్రకటన స్వేచ్ఛ అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు చాడ వెంకట్‌రెడ్డి, కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ నేతలు పాల్గొన్నారు.