19-12-2025 05:53:36 PM
మోతె: రెక్కాడితే డొక్కాడని కుటుంబంలో పుట్టిన ఓ యువకుడు గ్రూప్ 3 ఉద్యోగం సాధించడంతో ఆ కుటుంబం ఆనంద సాగరంలో మునిగితేలుతుంది. మూడు పూటల తినడానికి ఇబ్బంది అయినా యువకుడు నేడు ప్రభుత్వ కొలువు సాధించడంతో ఆ కుటుంబం ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే మండలంలోని గోప తండా కు చెందిన జరుపుల భీమ్లా నాయక్, బుజ్జి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. అయితే వీరిది నిరుపేద కుటుంబం కావడంతో కూలీ, నాలీ చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ముగ్గురు పిల్లలను చదివించడం కష్టతరం కావడంతో ఇద్దరు ఆడపిల్లలను ఐదో తరగతి వరకే చదివించి వయసు వచ్చిన తర్వాత వివాహాలు చేశారు.
కాని కుమారుడైన జరుపులా రంగాను మాత్రం కూలీ చేయగా వచ్చిన డబ్బులతో ఇంజనీరింగ్ వరకు పూర్తి చేయించారు. అయితే తండ్రి 2013 వ సంవత్సరంలో మృతి చెందడం గమనించదగ్గ విషయం.తల్లి పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకొని ఎలాగైనా ప్రభుత్వ కొలువును సాధించాలని ఉద్దేశంతో 2018 వ సంవత్సరం నుండి ఎక్కడ శిక్షణలు తీసుకోకుండా సొంతంగా యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో గ్రూప్ 2, 3 నోటిఫికేషన్ రావడంతో వాటికి దరఖాస్తు చేశాడు. అయితే గ్రూప్ 2 మార్కులతో మిస్ అవ్వగా, గ్రూప్ 3 లో 265 మార్కులు సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.
దీంతో అతనికి ’అసిస్టెంట్ ఆడిటరీ ఆఫీసర్’ ఉద్యోగమును కేటాయించారు. రంగా ఒకటి నుండి 5వ తరగతి వరకు ఎంపీపీ ఎస్ గోపతండ, 6 నుండి 10వ తరగతి వరకు జడ్పీహెచ్ఎస్ తుమ్మగూడెం, ఇంటర్మీడియట్ ఎస్ వి ఎస్ జూనియర్ కళాశాల కూసుమంచి, బీ.టెక్ ఖమ్మం జిల్లా కారేపల్లి శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి చేశాడు. తను చదువుకోవడానికి ఉద్యోగం సాధించడానికి అక్క బావలు స్నేహితులు భూక్య సూర్య నాయక్ సహకారం మరువలేనిదని రంగా తెలిపారు. ఎలాగైనా ఐఏఎస్ ను సాధించడమే తన లక్ష్యంమని అన్నాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుతూ ఉద్యోగం సాధించిన రంగాను బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు, అభినందించారు.