ప్రహరీ గోడ లేక విద్యార్థుల అవస్థలు!
కంగ్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతుల కొరత
కంగ్టి, ఆగస్టు 6 (విజయక్రాంతి): కంగ్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీస వసతుల లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలలో మొత్తం 215 మంది విద్యార్థులు ఉండగా, ప్రతిరోజూ సుమారు 140 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. 10 మంది లెక్చరర్లు విధులు నిర్వహిస్తున్నారు. కళాశాలకు ప్రహరీగోడ లేకపోవడంతో బయటి వ్యక్తులు, పశువులు కాలేజ్ గ్రౌండ్ లోకి ప్రవేశిస్తున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భవనాల చుట్టూ గడ్డి, పొదలు పెరిగిపోవడం, పరిశుభ్రత లోపించడం, మరుగుదొడ్లు, తాగునీటి వంటి ప్రాథమిక వసతులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడు తున్నారు. అదేవిధంగా గతవారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. ఈ గదుల నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కంచె ఏర్పాటు చేస్తాం
కళాశాల ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.28 లక్షలు మంజూరయ్యాయి. మొదటి విడతగా రూ.7.50 లక్షలు అమ్మ ఆదర్శ కమిటీ ఖాతాలో జమయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం చిన్నచిన్న పనులు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయి ప్రహరీ గోడకు బదులుగా కళాశాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, గ్రౌండ్ను లెవెలింగ్ చేసే పనులు జరుగుతున్నాయి. రెండు నుంచి మూడు నెలల్లో పనులను పూర్తి చేస్తాం. విద్యార్థులకు త్వరలో నోట్బుక్స్, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం అందుబాటులోకి వస్తాయి.స్పోరట్స్ మెటీరియల్ ఇప్పటికే అందుబాటులో ఉంది.
కాలేజ్ ప్రిన్సిపాల్ రాంప్రసాద్






