13 July, 2026 | 2:27 AM

చట్టసభల్లో ఓబీసీలకు ప్రాతినిథ్య లోటు

13-07-2026 01:56 AM
  1. జనాభాలో మెజారిటీ అయినా తీరని అన్యాయం
  2. హాఫ్ డెమోక్రసీగా భారత్ మారుతోంది
  3. బీసీ ఉద్యమాలు సొంత మీడియాలపై దృష్టిపెట్టాలి
  4. మాజీ డీజీపీ డాక్టర్ పూర్ణచంద్రరావు

చెన్నై, జూలై 12: దేశంలోని చట్టసభల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు వారి జనాభాకు తగిన రాజకీయ ప్రాతినిథ్యం లభించడం లేదని మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ), సామాజిక న్యాయవాది డాక్టర్ జే పూర్ణచంద్రరావు అన్నారు. దీంతో భారత ప్రజాస్వామ్యం తీవ్రమైన ప్రాతినిథ్య లోటుతో బాధపడుతోందని స్పష్టం చేశారు. దీంతో హాఫ్ డెమోక్రసీగా భారత్ మారుతోందని ఆందోళన చెందారు.

బీసీ ఉద్యమాలు సొంత మీడియాలపై దృష్టిపెట్టాలని, భవిష్యత్ తరాల బీసీ నాయకత్వం కోసం థింక్‌ట్యాంకులు, నాయకత్వ శిక్షణా సంస్థలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివారం చెన్నై రాయపేటలోని ఈఎన్ శేష మహల్లో పార్టీ ఫర్ ది రైట్స్ ఆఫ్ ఓబీసీస్ (పీఎఫ్‌ఆర్‌ఓబీసీస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓబీసీ సమాజాలపై కులగణన ప్రాముఖ్యత ప్రభావాలు’ సదస్సులో ఆయన ప్రసంగిం చారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జనాభాలో సుమారు 8 శాతం మాత్రమే ఉన్న రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు 175 మంది ఎమ్మెల్యేల్లో 62 మంది ప్రాతినిథ్యం పొందారని అన్నారు. అదే రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న వెనుకబడిన తరగతులకు (బీసీలు) కేవలం 40 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని తెలిపారు.

గత 16 అసెంబ్లీ ఎన్నికల గణాంకాలను ప్రస్తావిస్తూ, మొత్తం 2,903 ఎమ్మెల్యే స్థానాల్లో రెడ్డి, కమ్మ వర్గాలకు చెందిన వారు 1,207 స్థానాలు గెలుచుకోగా, బీసీలు కేవలం 498 స్థానాలనే గెలిచారని చెప్పారు. రాష్ట్రంలోని వందకుపై గా బీసీ కులాలకు ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యే కూడా ఎన్నిక కాలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో పరిస్థితి మరింత ఆందోళనక రంగా ఉందని, రెడ్డి, వెలమ, కమ్మ వర్గాల జనాభా వాటాతో పోలిస్తే వారి రాజకీయ ప్రాతినిథ్యం అధికంగా ఉండగా, 56 శాతం జనాభా కలిగిన బీసీలు తీవ్రంగా ప్రాతినిథ్యం కోల్పోయారని అన్నారు.

అలాగే గణనీయమైన జనాభా ఉన్నప్పటికీ బీసీ ముస్లింలకు రాజకీయ ప్రాతినిథ్యం దాదాపు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే భారత ప్రజాస్వామ్యం ‘హాఫ్ డెమోక్రసీ’గా మారిందని పూర్ణచంద్రరావు వ్యాఖ్యానించారు. మహిళలు, ఓబీసీలు, ముస్లింలు, ఇతర సామాజికంగా వెనుకబడిన వర్గాలకు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో తగిన ప్రాతినిథ్యం లేదని స్పష్టం చేశారు. బీసీ ఉద్యమాలు ప్రధాన మీడియాపైనే ఆధారపడకుండా తమ సొంత సమాచార వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

అట్టడుగు వర్గాల యువత యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫారాలు, సామాజిక మాధ్యమాల ద్వారా సామాజిక న్యాయం అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. భవిష్యత్ తరాల బీసీ నాయకత్వాన్ని తీర్చిదిద్దేందుకు థింక్‌ట్యాంకులు, నాయకత్వ శిక్షణా సంస్థలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో భారతరత్న బీపీ మండల్ మనమడు, రెండో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ డాక్టర్ సూరజ్‌యాదవ్, మాజీ ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అశోక్ వర్ధన్ శెట్టి, అఖిల భారత ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు గౌడ్ కిరణ్ కుమార్ ప్రసంగించారు. ప్రస్తుతం కొనసాగుతున్న జనగణన రెండో దశలో ఓబీసీలకు ప్రత్యేక కుల కోడ్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఓబీసీలు సమన్వయంతో ప్రజాస్వామ్యబద్ధ ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. సదస్సుకు పార్టీ ఫర్ ది రైట్స్ ఆఫ్ ఓబీసీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు వీ రత్నసభాపతి అధ్యక్షత వహించారు.