సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి
ఆధ్యాత్మికత తెలియని వారికి ఆలయాల్లో విధులేల?
అయోగ్యుల కారణంగానే అయోధ్య నిధుల దుర్వినియోగం
ఆలయాలపై పీఠాధిపతులు, వైష్ణవాచార్యుల పర్యవేక్షణ ఉండాలి
ద్వారకా పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి
గాంధీనగర్, జూలై ౧౨: ‘అయోధ్య రామ్‌మందిర్‌లో నిధుల దుర్వినియోగం మమ్మల్ని కలచివేసింది. ఆలయ నిర్వహణలో ఆధ్యాత్మికత పట్ల, సనాతన ధర్మం పట్ల ఏమాత్రం అవగాహనలేని సిబ్బంది, అధికారులను నియమించడం వల్లే ఈ దుస్థితి. ధార్మిక అంశాలతో సంబంధం లేని వారిని ఆయల నిర్వహణ, విధులకు నియమించడం ఆక్షేపణీయం. అందుకు పరిష్కారం ఉంది.
దేశంలోని నాలుగు పీఠాల శంకరాచార్యులు, ఐదుగురు వైష్ణవాచార్యులతో ఇతర ఆధ్యాత్మిక గురువులతో కూడిన ‘సనాతన ధర్మ సంరక్షణ సమితి’ వంటి సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. తద్వారా ఆలయాలను ప్రభుత్వాల నియంత్రణ నుంచి పూర్తిగా విముక్తి కల్పించాలి’ అని గుజరాత్‌లోని ద్వారకా పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి మహారాజ్ డిమాండ్ చేశారు. ఇది తమ హృదయపూర్వక విన్నపమని, ఆదేశమని స్పష్టం చేశారు.
తాజాగా స్వామీజీ ఓ వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దేశంలోని మసీదులు, గురుద్వారాలు, చర్జీలకు లేని ప్రభుత్వ నియంత్రణ, ఒక్క హిందూ ఆలయాలకే ఎందుకుని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తులకు ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. ఆలయాల సంప్రదాయాల గురించి అవగాహన లేని అధికారులు ఆలయాల్లో ఉండటం వల్లే హుండీ కానుకల దుర్వినియోగం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అధికారులకు శాస్త్ర పరిజ్ఞానం గానీ, మతపరమైన ఆచారాలపై అనుభవం గానీ ఉండవని అభిప్రాయపడ్డారు. ధార్మిక విధివిధానాలు, నిషేధాల గురించి వారికి తెలియదని, మతపరమైన ఆచారాలు నిర్వహించేందుకు వారు అర్హులు కారని నొక్కిచెప్పారు. ఏ రంగానికి చెందిన నిపుణులకు, ఆ రంగంపై అధికారం ఇవ్వాలని, అర్హత లేని వ్యక్తులకు పనులు అప్పగిస్తే అయోధ్యలో జరిగిన ఫలితాలే పునరావృతం అవుతాయని హెచ్చరించారు.
ఆయాల విషయంలో ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య ఆలోచనా విధానంలో పెద్ద తేడా ఉందని అభిప్రాయపడ్డారు. భక్తులు అయోధ్య, ద్వారక, బద్రీనాథ్, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలను భగవంతుడు, మహర్షులు తపస్సు చేసిన పుణ్యభూములుగా భావిస్తారని తెలిపారు. కానీ, రాజకీయ నాయకులు, అధికారులు మాత్రం వాటిని కేవలం పర్యాటక ప్రాంతాలుగా చూస్తున్నారని విమర్శించారు. ఈ ఆలోచనా దృక్పథం వల్లే వారిలో భక్తిభావం కలగడం లేదని స్పష్టం చేశారు.
యాత్రికులు ఆధ్యాత్మిక శక్తిని పొందేలా పుణ్యక్షేత్రాల వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు. ధార్మిక క్షేత్రాల్లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే సనాతన బోర్డు ఏర్పాటు అత్యంత అవసరమని స్వామిజీ నొక్కిచెప్పారు. ఈ బోర్డుకు అన్ని మతపరమైన హక్కులు, అధికారాలు బదిలీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రామాయణంలో విశ్వామిత్ర మహర్షి, దశరథ మహారాజు ప్రస్తావనను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. సమర్థత, యోగ్యత ఉన్నవారికే బాధ్యతలు అప్పగించాలని దశరథుడికి నాడు విశ్వమిత్రుడు ఉపదేశించాడని గుర్తుచేశారు.






