19 May, 2026 | 1:45 AM

బీఆర్‌ఎస్‌లో భారీగా కాంగ్రెస్ నేతల చేరికలు

19-05-2026 12:42 AM

కేసీఆర్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు : సబితా ఇంద్రారెడ్డి

మొయినాబాద్, మే 18 (విజయ క్రాంతి): ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కోల్పోయి ప్రజలు బాధపడుతున్నారని, మళ్లీ కేసీఆర్ నాయకత్వం రావాలని ప్రజలు, రైతులు, కార్మికులు కోరుకుంటున్నారని అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, బీఆర్‌ఎస్ జిల్లా ఇన్చార్జి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు సలీం ఖాన్తో పాటు సుమారు 100 మంది కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మాజీ సర్పంచులు ఎం. శ్రీహరి యాదవ్, ఎం. మంజుల రవి యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు సంగం రాజుగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రైతులు, కార్మికులు, మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు.

మైనారిటీల అభ్యున్నతి కోసం షాదీ ముబారక్, మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిందని, రంగారెడ్డి జిల్లాలో రైతుల భూములపై ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో భూములు సేకరిస్తున్నప్పటికీ అభివృద్ధి మాత్రం కనిపించడం లేదన్నారు.త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తామని, పార్టీ నుంచి వెళ్లిన వారిని తిరిగి బీఆర్‌ఎస్లోకి ఆహ్వానించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.