calender_icon.png 16 December, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలో ఐక్యత లోపం!

16-12-2025 01:27:41 AM

  1. ఎవరికి వారే యమునా తీరే అనేలా నాయకుల తీరు
  2. రాష్ట్ర అధ్యక్షుడు మినహా గట్టిగా వినపడని ఇతర నేతల గళం
  3. నియోజకవర్గాలను వీడని నేతలు
  4. కమలనాథుల్లో అంతర్గత యుద్ధం నడుస్తోందని చర్చ
  5. నేతలందరూ సమష్ఠిగా కలిసి చేపట్టిన కార్యక్రమాలు తక్కువే
  6. అసంతృప్తిలో పార్టీ శ్రేణులు

హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలోని బీజేపీ నాయకుల పరిస్థితి వింతగా కనిపిస్తోంది. గట్టిగా బరిగీసి కొట్లాడితే రాబోయే జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ ఎందుకో నాయకులు తటపటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఇష్టం లేదేమో...లేక తమకు గుర్తింపు ఇవ్వలేదనో... తెలియదుగానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్ రావును ఆ పా ర్టీ జాతీయ నాయకత్వం నియమించిన కా న్నుంచీ నేతలందరి మధ్య ఐక్యత లోపించిందనేది ఏ కార్యకర్తను అడిగినా ఇట్టే చెప్పే స్తారు.

కొంత మంది నేతలకు ఒకరంటే ఒకరికి పడటం లేదనే గుసగుసలు వినిపిస్తు న్నాయి. రాష్ట్ర పార్టీ పిలుపిచ్చిన కార్యక్రమాలు, సమావేశాలు, మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలోనూ ఈ లోపం స్ప ష్టంగా కనబడింది. అయినా కానీ కొంత మంది నేతల తీరు మారడంలేదనే చర్చ పా ర్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తమకు నచ్చితే హాజరవుతున్నారు...లేదంటే ఏదో వ్యక్తిగత పని అని చెప్పి గైర్హాజరవుతున్న పరిస్థితి రాష్ట్ర బాధ్యుల్లో కనిపిస్తోంది.

సమష్ఠిగా గళం విప్పని నేతలు

రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం సమష్ఠిగా గళం విప్పడంలేదు. ఎవరికి వారు సొంత ఎజెండాలతో పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతోపాటు ఒకరిద్దరు  మినహా మిగతా నేతలెవరూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసే విమర్శలకు గట్టిగా తమ వాయిస్‌ను వినిపించడంలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా సొంత నియోజకవర్గాలకే అంటిపెట్టుకొని ఉంటున్నారనే విమర్శ ఉంది. మనకెందుకులే...మనం మన నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చూసుకుంటే చాలు...మళ్లీ గెలవాలంటే కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి కదా..అనుకొని నియోజకవ్గాలకే ఎక్కువగా సమయం ఇస్తున్నట్లుగా శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. 

పైకే కలిసి మెలసి..

బీజేపీ నాయకులు పైకే కలిసి మెలసి ఉన్నట్లుగా కనిపిస్తారు. కానీ,లోపల మాత్రం ఒకరంటే ఒకరికి పడదు. ఎవరి దారి వారిది అన్నట్లుగా ఉంటారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు కలిసి ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్న దాఖలాల్లేవు. ఓటు బ్యాం కు బలంగా పెంచుకునే అవకాశాలు ఉన్నా సమష్ఠి  నాయకత్వం లోపం కారణంగా విఫలమవుతున్నట్లుగా కేంద్ర నాయకత్వానికి నిఘా నివేదికలు ఎప్పటికప్పుడు అందుతున్నట్లుగా తెలుస్తోంది.

నాయకుల మధ్య ఆధిపత్య పోరు పార్టీని బలోపేతం చేయలేకపోతుందన్న భావన కేంద్ర నాయకత్వంలో కనిపిస్తుంది. కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నప్పటకీ, ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులున్నా, ఎనిమిది మంది శాసనసభ్యులున్న, ముగ్గురు ఎమ్మెల్సీలున్నా పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో విఫలమవుతున్నట్లుగా తెలుస్తోంది. పాత, కొత్త నేతల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతున్నట్లు కార్యకర్తల్లో తీవ్ర చర్చ జరగుతోంది. 

ఎనిమిది మంది చొప్పున ఎంపీలు, ఎమ్మెల్యేలున్నా..

బీజేపీకి ఎనిమిది మంది ఎంపీ లు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, పనితీరు, ప్రజల సమస్యలపై వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది మాత్రమే కౌంటర్లిస్తున్నారు.. తప్పితే మిగతా బీజేపీ నాయకులు తమ వాణిని వినిపించడంలేదు. దీంతో క్యాడర్ అంతా నిరుత్సాహంలో ఉన్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలపై ఎప్పటికప్పుడు కేంద్ర నాయ కత్వం నివేదికలు తెప్పించుకుంటోంది.

ఇక్కడ నేతల మధ్య సమ న్వయం లేదని గ్రహించింది. ఈక్రమంలోనే ఈనెల 5న హైదరా బాద్‌లో జరిగిన వర్క్ షాప్‌లో బీజేపీ జాతీయ కీలక నేత బీఎల్ సంతోష్ రాష్ట్ర నాయకులకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. పార్టీలో ఉంటే ఉండండి. పోతే పోండి..మీరు పోతే పార్టీకి కమిట్‌మెంట్‌తో పనిచేసే నాయకులొస్తారని కీలక వ్యాఖ ్యలు కూడా చేశారు. ఇదేకాదు ఇటీవల ఢిల్లీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందని బీజేపీ ఎంపీల సమావేశంలోనూ పీఎం నరేంద్రమోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీల పనితీరు బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.