రైతులకు జీవనాధారం లక్నవరం

27-04-2024 02:00:06 AM

రెండు పంటలకు నీళ్లిచ్చేలా చర్యలు చేపడతాం

మంత్రి సీతక్క

జయశంకర్ భూపాలపల్లి(ములుగు), ఏప్రిల్ 26 (విజయక్రాంతి): రైతులకు జీవనాధారమైన లక్నవరం చెరువుకు త్వరలోనే గోదావరి జలాలు అందించి రెండు పంటకు నీళ్లు అందేలా చూస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువును మంత్రి పరిశీలించారు. ఎండాకాలం దృష్ట్యా చెరువులు, కుంటలు ఎండిపోయాయని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని, త్వరలోనే రామప్ప రిజర్వాయర్ నుంచి కాశిందేవిపేట మీదుగా కెనాల్ ద్వారా లక్నవరం చెరువుకు నీటిని మళ్లించి మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. లక్నవరాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగానే కెనాల్ పనులు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు పాల్గొన్నారు.