9 August, 2026 | 2:09 PM

ఘనంగా లాల్ దర్వాజా బోనాలు

09-08-2026 01:15 PM

హైదరాబాద్: భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఓల్డ్ సిటీ, లాల్ దర్వాజా బోనాలు(Lal Darwaza Bonalu) ఘనంగా నిర్వహిస్తున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతో నగరంలో ప్రత్యేక శోభ నెలకొంది. సింహవాహిని అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలు ఆదివారం నాడు నిర్వహిస్తున్నారు. బోనాల జాతరతో అమ్మవారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయం తరుఫున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.

ప్రభుత్వం తరుఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 10.30 వరకు అమ్మవారికి బోనాలు, ఒడి బియ్యం, చీర, సారె సమర్పించనున్నారు. సాయంత్రం సింహ వాహిని అమ్మవారి శాంతి కల్యాణం నిర్వహించనున్నారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలతో లాల్ దర్వాజ మార్మోగుతోంది. అమ్మవారిని దర్శనానికి 5లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా చేస్తున్నారు. 2,500 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు నిర్వహించారు.

రేపు రంగం భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, భవానీ రథయాత్ర నిర్వహించనున్నారు. ఘనంగా లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారి బోనాలు చేస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవర కొండ, ఆనంద్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా, ఎంపీ చామల కిరణ్ కుమార్, జగ్గారెడ్డి, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. సింగర్ మంగ్లి అమ్మవారికి బోనం సమర్పించారు.