9 July, 2026 | 1:00 AM

డబ్లింగ్ పనులకు భూసేకరణ పూర్తి చేయాలి

09-07-2026 12:03 AM

గద్వాల, జూలై 8 (విజయక్రాంతి) : రైల్వే డబ్లింగ్ పనులకు జిల్లా పరిధిలో కావాల్సిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఇరిగేషన్ మరియు రైల్వే లైన్ పనులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై బుధవారం ఢిల్లీ నుంచి ఉన్నతాధికారులు సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొనగా జోగులాంబ గద్వాల కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి వీసీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ నుంచి డోన్ వరకు చేపడుతున్న డబ్లింగ్ రైల్వే లైన్ పనులకు జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో 104 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే సంబంధిత రైతుల నుంచి భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున త్వరలోనే అవార్డు పూర్తి చేయాలన్నారు. అవార్డు పూర్తికాగానే రైల్వే అధికారులకు ఈ భూమిని అప్పగించడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.  ఈ సమావేశంలో భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామలింగేశ్వర గౌడ్ పాల్గొన్నారు.