ప్రజా ప్రభుత్వంలో రవాణా పరుగులు
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నాగర్ కర్నూల్, జూలై 8 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో బుధవారం అభివృద్ధి కార్యక్రమాల సందడి నెలకొంది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలో రూ.12 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక బస్టాండ్కు శంకుస్థాపన చేయడంతో పాటు నూతన ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ), భరోసా సెంటర్ను ప్రారంభించారు. తిమ్మాజిపేట బస్టాండ్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయగా, తుడుకూర్తిలో సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.
ఇంతకుముందు జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో నూతన వైయస్సార్ విగ్రహం ప్రారంభించి నివాళులు అర్పించారు. అనంతరం సర్వాయి సర్దార్ పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని బస్డిపో సమీపంలో నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలంలో రూ.12 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక బస్టాండ్లో ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు, డిజిటల్ సమాచార వ్యవస్థ, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల బాటలో పయనిస్తోందని, నాగర్ కర్నూల్ బస్టాండ్ పూర్తయితే రాష్ట్రంలోని 365వ బస్టాండ్గా గుర్తింపు పొందుతుందన్నారు. గత ప్రభుత్వంలో సుమారు 53 రోజులపాటు తమ హక్కులు సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు రోడ్ ఎక్కితే వారి పీక పిసికెంత పనిచేశారని తనొక్కడి స్వార్థం కోసం కేసీఆర్ ఆర్టీసీని అమ్ముకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కానీ ప్రజా ప్రభుత్వంలో రవాణా సౌకర్యం కార్మికుల సంక్షేమం సంస్థ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.






