13 August, 2026 | 2:48 AM

భూమాత పేరుతో భూ దందా

13-08-2026 12:00 AM

ఎనిమిది మంది చేతుల్లో నలిగిపోతున్న రాష్ట్రం

బీజేఎల్పీ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): భూమాత పేరు మీద భూ దందా చేస్తున్నార ని, ధరణి స్థానంలో భూ భారతిని తీసుకువ చ్చి భూ హారతి చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2జీ, బొగ్గు కుంభకోణాలు చూశామని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక కుంభకోణాలు చేస్తుందని ఆరోపించారు. ‘ఆ నలుగురు మంత్రులు.. ఆ నలుగురు గుత్తేదారులు.. ఈ ఎనిమిది మంది చేతిలో రాష్ట్రం నలిగిపోతుంది’ అని విమర్శిం చారు. ధరణిపై మంత్రి పొంగులేటి ఫోరెన్సిక్ ఆడిట్‌లోని వివరాలను, వాస్తవాలను ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు.

రెవెన్యూ మంత్రే భూ ములను కాజేస్తున్నారని, 22ఏ కింద పేద వారి భూములు ప్రొహిబిటెడ్ జాబితాలో చేరాయన్నారు. కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి వచ్చిందని, మళ్ళీ ఆ జాబితాలో నుంచి ఎందుకు బయటకు వస్తుందని ప్రశ్నించారు. ముడుపులందితే జాబితానుంచి తీసివేస్తున్నారని, ఆరు లక్షల అటవీ భూములు అన్యాక్రాంతం, రెండున్నర లక్షల దేవాదాయ, అసైన్డ్, వక్ఫ్ బోర్డు భూములు బీఆర్‌ఎస్ నేతలు కబ్జా చేశారని 2024 డిసెంబర్ 18న భట్టి విక్రమార్క ఆరోపించారని, మరీ ఆ భూముల్ని ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోయారన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబం నాదర్‌గుల్, వట్టి నాగులపల్లిలో ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూసింది నిజం కాదా? అన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న పొంగులేటి వెనక ఉన్న వ్యక్తి ఎవరు అని ప్రశ్నించారు. ప్యూచర్ సిటీ పేరు మీద భూ దందా నడుస్తుంది నిజం కాదా అన్నారు. భూ దందాల మీద ఈడీ, సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని డిమాండ్ చేశారు. భూ దందాలను ఆధారాలతో సహా నిరూపించడానికి తాను సిద్ధమేనని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైటెక్స్‌లో 12 ఎకరాల్లో కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నారని తెలిపారు.

ఫీనిక్స్ కంపెనీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎందుకు భూ బదలాయింపు జరిగిందని, బీఆర్‌ఎస్‌కు బినామిగా ఉన్న ఫీనిక్స్ ఇప్పుడు కాంగ్రెస్‌కు బినామీగా మారిందా? అని నిలదీశారు. ఫీనిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్‌ఫర్ అయిన రూ. 15 వేల కోట్లపైన విచారణ జరిపించాలని, తాను ఆధారాలతో సహా నిరూపిస్తా.. మంత్రి శ్రీధర్ బాబు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు.