రేపటి నుంచి భూముల విలువల పెంపు
రెవెన్యూ మంత్రి పొంగులేటి అధికారిక ప్రకటన
గత ప్రభుత్వం తక్కువ, ఎక్కువ పెంచింది
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో భూముల విలువలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు భూముల ధరలు సవరిస్తున్నట్లు రాష్ట్రరెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఈ మేరకు సవరించిన భూముల విలువలు శుక్రవారం నుంచి అమల్లోకి తెస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు. ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక ప్రకారం ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని విస్తృతస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
శాస్త్రీయ పద్ధతిలో కొత్త విలువలను నిర్ణయించామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి సమగ్ర కసరత్తు లేకుండా, అశాస్త్రీయ పద్ధతుల్లో భూముల, రిజిస్ట్రేషన్ చార్జీలను రెండుసార్లు పెంచిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. వాస్తవ, మార్కెట్ విలువలకు మధ్య భారీ అంతరాయాలు ఉండడంతో భూ లావాదేవీలలో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు. 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని మార్కెట్ విలువలు, గ్రామీణ, పట్టణ, స్థానిక పరిస్థితులను పరిశీలించి విలువలను సవరించామన్నారు. ఇప్పటికే అధిక మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు ప్రతిపాదించలేదన్నారు.
అక్కడ ప్రాథమిక రేట్లు..
ప్రాంతాల అభివృద్ధి స్థాయిని బట్టి హెచ్‌ఎండీఏ, క్యూర్ పరిధి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కనీస ప్రాథమిక ధరలను నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. నిర్మా ణ వ్యయాలను కూడా 2021 తర్వాత సవరించలేదని, గత ఐదేళ్లలో నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో నిర్మాణ రేట్ల సవరణ అవసరమైందన్నారు.
అనేక మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ కావడం, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆర్సీసీ, నాన్-ఆర్సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లో సవరించినట్లు వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ సవరణలు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, భూ లావాదేవీలలో పారదర్శకత పెంపునకు, ప్రభుత్వ ఆదాయ వృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని మంత్రి పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.






