4 June, 2026 | 1:22 AM

ధాన్యం సేకరణను ముమ్మరం చేయాలి

04-06-2026 12:00 AM

అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

ఇప్పటికే 70.06 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు  

గత ఏడాది రబీలో సేకరించింది 74.2 లక్షల టన్నులే

కల్లాల్లో ఇంకా 4.95 లక్షల టన్నుల ధాన్యం: మంత్రి

వరి ధాన్యం కొనుగోలుపై అధికారులు, కలెక్టర్లతో సమీక్ష

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో ధాన్యం సేకరణ ముమ్మరం చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో జరిగిందని తెలిపారు.

ఇప్పటివరకు 70.06 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని, గతేడాది రబీలో వడ్ల సేకరణ దాదాపు 75 లక్షల టన్నులే జరిగిందని, ఇప్పుడు ఆ మార్కును దాటే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద మరో 4.95 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉందని, వచ్చే వారంలో పొలాల నుంచి అదనంగా ధాన్యం రాకతో మొత్తం సేకరణ గత ఏడాది 74.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును దాటి, రాష్ట్రానికి ఒక కొత్త మైలురాయిని నెలకొల్పుతుందని మంత్రి ఉత్తమ్ అన్నారు.

వరి ధాన్యం కొనుగోలుపై బుధవారం సంబంధిత శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న జిల్లాల్లో, యుద్ధ ప్రాతిపదికన అడ్డంకులను పరిష్కరించాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులు, హమాలీల కొరత వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, గత ఏడాది సాధించిన దానికంటే అధిక కొనుగోలు జరిగిందన్నారు. రాబోయే పది రోజుల పాటు వరి ధాన్యం వచ్చే అవకాశం ఉన్న నిజామాబాద్, నిర్మల్, నాగర్‌కర్నూల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రుతుపవనాలు రాకముందే కొనుగోలును పూర్తి చేయాలన్నారు. 

పూర్తి కావస్తున్న వరిధాన్యం కొనుగోళ్లు

అనేక జిల్లాల్లో కొనుగోలు కార్యకలాపాలు పూర్తి కావస్తున్నాయని, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఒకటి రెండు రోజుల్లో పూర్తి కానుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ధాన్యం నిల్వకు స్థలం కొరత ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కస్టమ్ మిల్ రైస్ (సీఎంఆర్), రవాణాను కూడా సమీక్షించి, కొత్తగా వచ్చిన సరుకుల సేకరణ సజావుగా జరిగేలా రవాణా, నిల్వ కార్యకలాపాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

సేకరణ కేంద్రాల పనితీరును, హమాలీలు, సహాయక సిబ్బందితో సహా సేకరణ కార్యకలాపాలలో నిమగ్నమైన కార్మికుల సంక్షేమంపైన మంత్రి ఆరా తీశారు. ప్రతిపాదనలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు రేయింబవళ్లు పనిచేస్తున్న సిబ్బంది, రవాణా కార్మికులు, కూలీల కృషిని మంత్రి అభినందించారు.

హమాలీల వేతనాలను మెరుగుపర్చాలి

హమాలీలకు మెరుగైన సంక్షేమ చర్యలు కల్పించి, వారి పని పరిస్థితులను మెరుగుపరచాలని మంత్రి ఉత్త మ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 170 సరఫ రా నియంత్రణ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో సుమారు 3,000 నుంచి 3,120 మంది హమాలీలు, స్వీపర్లు పనిచేస్తున్నారని తెలిపారు. వారు అంకితభావంతో పనిచేస్తున్నారని, అం దుకు వారికిస్తున్న ప్రస్తుత రేట్లను పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ గృహపథకానికి అర్హులైన హమాలీలు, స్వీపర్లను గుర్తించడానికి ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని తెలిపారు. ప్రంట్‌లైన్ కార్మికులకు ప్రభుత్వం ఎప్పుడు మద్దతుగా ఉం టుందన్నారు.