09-07-2025 12:00:00 AM
కబ్జా నుంచి స్వాధీనం చేసుకున్న హైడ్రా
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 8 (విజయక్రాంతి): రెండు దశాబ్దాలుగా కబ్జా కోరల్లో చిక్కుకున్న కోట్ల రూపాయల విలువైన ప్రజా స్థలానికి ఎట్టకేలకు విముక్తి లభించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హైదర్‌గూడ నలందనగర్‌లో ఆక్రమణలకు గురైన 1094 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.
ఏజీ ఆఫీస్ కో -ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 2001లో నలం దనగర్ పేరుతో అప్పటి హుడా అనుమతులతో ఓ వెంచర్ వేసింది. లేఅవుట్ కోసం భూమిని విక్రయించిన పాత యజమానులే, ఇది తమ సొంత భూమిలో భాగమంటూ ప్రజావసరాల పార్కు కోసం కేటాయించిన 1094 గజాల స్థలాన్ని ఆక్రమించుకుని ప్రహరీ నిర్మించారు. తమ కాలనీ స్థలం కబ్జాకు గురైందని నలందనగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అధికారులు, సదరు స్థలం లేఅవుట్‌కు చెందినదిగానే నిర్ధారించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం హైడ్రా అధికారులు, పోలీసుల బందోబస్తుతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. స్థలంలో నిర్మించిన ప్రహరీని, తాత్కాలిక షెడ్డును కూల్చివేశారు.
ఈ సమయంలో ఆక్రమణదారులు, వారి కుటుంబ సభ్యులు అధికారు లను అడ్డుకునే ప్రయత్నం చేసి, ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆక్రమణల నుంచి పార్కు స్థలానికి విముక్తి కలగడంతో నలందనగర్ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.