calender_icon.png 9 July, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

08-07-2025 11:15:15 PM

ఐఎన్టియూసి పట్టణ అధ్యక్షులు వడ్లకొండ రంజిత్ గౌడ్..

మందమర్రి (విజయక్రాంతి): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎన్టియుసి పట్టణ అధ్యక్షులు వడ్లకొండ రంజిత్ గౌడ్(INTUC Town President Vadlakonda Ranjith Goud) కోరారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాల రాసే విధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సంఘటిత, అసంఘటిత కార్మికులందరూ సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమ్మె విజయవంతం చేసేందుకు ఐఎన్టియుసి ముందుండి పోరాడుతున్నదని స్పష్టం చేశారు.

గత పదేళ్లుగా వార్షిక కార్మిక సమావేశాలు పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ఆకాశంలో నడిచే విమానాలను, సముద్రాలపై నడిచే నౌకలను, భూమిపై నడిచే రైళ్లను, భూగర్భ గనులను, ఎల్ఐసిని చివరికి అంతరిక్షాన్ని సైతం ప్రైవేటికరణ చేసి ఆదానీ అంబానీలకు ఈ దేశ సంపదను శ్రామికశక్తిని దోచిపెట్టడానికి కుట్ర చేస్తున్నదని, అందులో భాగంగానే 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా మార్చి కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేయడం కనీస వేతన చట్టాన్ని నీరుగార్చడమే నాని అన్నారు.

పనిగంటలను పెంచడం పిఎఫ్ ను కుదించడం, పని ప్రదేశాల్లో రక్షణ లేకుండా చేయడం తదితర అంశాలను జోడించి రూపొందించిన ఈ చట్టాల వలన కార్మిక సంఘాలు నిర్వీర్యమవ్వడమే కాకుండా సమ్మె చేసే హక్కును కూడా కార్మికులు కోల్పోతారని, దీంతో కార్మికుల జీవితాలు  దుర్భలమవుతాయని,ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెను సంఘటితంగా అందరం పాల్గొని కార్మిక శక్తిని, ఐక్యతను చూపాలని  కోరారు.