పాక్‌కు పెద్ద ఎత్తున డ్రోన్లు, ఆయుధాలు
- తుర్కియే నుంచి విమానాల్లో రవాణా
- బలూచ్‌పై పట్టుకు పాక్ సైన్యం సిద్ధం
ఇస్లామాబాద్, ఆగస్టు 23: రక్షణ ఒప్పందం ముసుగులో తుర్కియే నుంచి పాక్‌కు భారీగా ఆయుధాలను సమకూర్చుకుంటోంది. గత 60 గంటల్లో 12కు పైగా సీ ఏ ఎం జంబో రవాణా సైనిక విమానాలు రావల్పిండిలోని నూర్‌ఖాన్, కరాచీలోని మస్రూర్ ఎయిర్‌బేస్‌లలో దిగాయని భారత అధికారులు తాజాగా గుర్తించారు. ఈ విమానాలలో తుర్కియే భారీ ఎత్తున డ్రోన్లను, ఏఐ గైడెడ్ ఆయుధాలను, ఉపగ్రహ ట్రాకింగ్ పరికరాలను పంపించినట్లు భారత్ భావిస్తుంది.
ఈ ఆయుధాలను బహవల్పూర్, రావల్పిండిలోని సైనిక కేంద్రాల్లో ఉంచారు. కెమాన్చే క్రయిజ్ క్షిపణి, బేరక్తార్ టిబి అకిన్సి డ్రోన్లు ఉన్నట్లుగా సమాచారం. మక్కాలో జరిగిన రక్షణ ఒప్పందం సందర్భంగా తుర్కియే అధ్యక్షుడిని పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఆయుధాలను అందించాల్సిందిగా కోరడంతో అందుకు ఒప్పుకొని ఆయుధాలను పంపించినట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా ఇటీవల పాక్, సౌదీ అరేబియా, తుర్కియేల మధ్య నాటో తరహా సైనిక ఒప్పందం కుదిరిన కొద్దిరోజుల్లోనే ఆయుధాలు అందడం భారత్ నిఘా వర్గాలు వీరి చర్యలపై ఓ కన్నేసి ఉంచాయి. కాగా బలూచిస్థాన్‌లో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు మునీర్ భారీ సైనిక చర్యలకు సిద్ధమవుతున్నారని, నిఘా వర్గాలు భావిస్తున్నాయి.






