మెడికో ప్రియాంక అంత్యక్రియలు పూర్తి
గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం
గద్వాల జిల్లా ఎక్లాస్‌పూర్‌కు మృతదేహం, అంత్యక్రియలు
కుటుంబ సభ్యులకు మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, రాజమహేంద్రం అర్బన్ ఎమ్మెల్యే శ్రీనివాస్ పరామర్శ
రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన ఏపీ మంత్రి టీజీ భరత్
సికింద్రాబాద్/ముషీరాబాద్ (విజయక్రాంతి)/అయిజ/అలంపూర్, ఆగస్టు 10: ఏపీలోని రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి, మృతిచెందిన మెడికో ప్రియాంక(28) అంత్యక్రియలు ఆమె స్వగ్రామంలో పూర్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని కిమ్స్‌లో ఆమె మృతిచెందగా.. సోమవారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యింది.
గాంధీ ఆస్పత్రిలో ప్రియాంక తండ్రిని మంత్రి వాకిటి శ్రీహరి, రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే శ్రీనివాస్, రాజమహేంద్రవరం టీడీపీ అధ్యక్షుడు వెంకట రమణా చౌదరి పరామర్శించి ఓదార్చారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆమె స్వస్థలమైన జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి తరలించారు. అక్కడే వేల మంది సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఐజాలో ఏపీ, తెలంగాణ అఖిలపక్ష నాయకులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
అన్ని విధాలుగా అండగా ఉంటాం: మంత్రి జూపల్లి
ప్రియాంక కుటుంబానికి తెలంగాణ ప్రభు త్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. కుటుంబాన్ని ఆదుకునే విషయంపై ముఖ్యమంత్రితో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు. సోమవారం గద్వాల జిల్లా అయిజ పట్టణంలో జరిగిన ప్రియాంక అంతిమ యాత్రలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పాల్గొన్నారు. ప్రియాంక మృతి యాక్సిడెంట్ కాదని.. వందశాతం మర్డర్ అని స్పష్టంగా కనపడుతోందని చెప్పారు. నిందితులకు ఉరిశిక్ష పడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.
రూ.20 లక్షల పరిహారం అందజేత
ప్రియాంక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. సీఎం చంద్రబాబు స్వయంగా స్పందించి బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటించినట్లు చెప్పారు. సోమవారం ఎక్లాస్పూర్ చేరుకున్న మంత్రి.. ప్రియాంక కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల పరిహారాన్ని అందజేశారు. ప్రియాంక కుటుంబం డబ్బు కోసం ఎలాంటి అభ్యర్థన చేయలేదని, తమకు న్యాయం జరగాలని మాత్రమే కోరిందని తెలిపారు. రూ.20 లక్షల పరిహారంతో పాటు వైద్య ఖర్చులను తిరిగి చెల్లించే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రి వెంట రాజమండ్రి జడ్పీ చైర్ పర్సన్ బుడ్డా బాబురావు ఉన్నారు.






