25 April, 2026 | 3:11 PM

ప్రపంచ ఆర్థికవ్యవస్థపై అనిశ్చితి?

05-03-2025 12:00 AM

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) , ప్రపంచ బ్యాంక్ 1944లో స్థాపించబడ్డాయి. ఈ రెండింటి ప్రధాన కేంద్రాలు కూడా వాషింగ్టన్ డీసీలో ఒకే వీధిలో ఉన్నాయి. ఈ రెండు సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక వాంఛనీయ పద్ధతిలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. ఐఎమ్‌ఎఫ్ సంక్షోభంలో ఉన్న దేశాలకు తాత్కాలిక ఆర్థిక సహాయం అందించగా, ప్రపంచ బ్యాంక్ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి పెడుతుంది. ఐఎమ్‌ఎఫ్‌లో 17.4 శాతం ఓటింగ్ హక్కులు, ప్రపంచ బ్యాంక్‌లో 16 శాతం వాటాతో అమెరికా ఎప్పటినుంచో ప్రధాన భరోసా దేశంగా ఉంది. అయితే అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవసరమైతే ఈ సంస్థల నుంచి వైదొలుగుతామంటూ చేసిన బెదిరింపు వ్యాఖ్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై తీవ్రమైన అనిశ్చితిని సృష్టించాయి. ఈ రెండు సంస్థలనుంచి అమెరికా వెనక్కు తగ్గితే, ప్రపంచ ఆర్థిక పాలనలో తీవ్రమైన మార్పులు సంభవించడంతో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు.

భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

ఆఫ్రికా, దక్షిణాసియా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఐఎమ్‌ఎఫ్, ప్రపంచ బ్యాంక్ నుంచి పెద్దఎత్తున ఆర్థిక సహాయాన్ని పొందుతున్నా యి. ఐఎమ్‌ఎఫ్ ఆర్జెంటీనా, పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలకు సంక్షోభాల సమయంలో రుణ సాయం అందించగా, ప్రపంచ బ్యాంక్ తాగునీరు, విద్యుత్, రహదారి నిర్మాణం వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చింది. ఐఎంఎఫ్ రుణం అందించకపోయి ఉంటే పాకిస్థాన్, శ్రీలంకలు ఆర్థిక సంక్షోభంనుంచి గట్టెక్కి ఉండేవే కాదు. అమెరికా వెనుకంజ వేస్తే ఈ రెండు సంస్థల ఆర్థిక సామర్థ్యం తగ్గిపోయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత కఠినమైన నిబంధనలతో ఇతర వనరుల కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది.

భారతదేశం ప్రస్తుతం ఐఎమ్‌ఎఫ్ రుణాలపై ఆధారపడటం లేదు కానీ, ప్రపంచ బ్యాంక్ నుంచి మౌలిక వసతుల అభివృద్ధికి నిధులను అందుకుంటూనే ఉంది. ప్రపంచ బ్యాంక్ ఇప్పటివరకు భారతదేశానికి 100 బిలియన్ డాలర్ల్లకు పైగా రుణాలు అందించి, రవాణా, విద్యుత్, పేదరిక నిర్మూలన వంటి రంగాల్లో కీలక ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చింది. ఐఎమ్‌ఎఫ్ ఆర్థిక విధానాల పర్యవేక్షణ ద్వారా దేశానికి ఆర్థిక సూచనలు అందించడంతోపాటు, ద్రవ్య, ఆర్థిక పాలనా విధానాలపై ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పుడు సడెన్‌గా అమెరికా వెనక్కు తగ్గితే, ప్రపంచ బ్యాంక్ నిధుల లభ్యత వెంటనే తగ్గిపోవడంతో భారత అభివృద్ధి ప్రాజెక్టులు నెమ్మదించవచ్చు. ఆసియా అభివృద్ధి బ్యాంక్( ఏడీబీ) లాంటి ఆర్థిక సంస్థలు ఉన్నప్పటికీ అవి విధించే షరతులు మరింత కఠినంగా ఉండాయనే వాదన ఉంది.

ఐఎమ్‌ఎఫ్ విధించే కఠినమైన ఆర్థిక నిబంధనల ప్రభావం గతంలో భారతదేశం అనుభవించింది. 1991 ఆర్థిక సంక్షోభం సమయంలో ఐఎమ్‌ఎఫ్ నుంచి రుణం పొందేందుకు భారత ప్రభుత్వం 67 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఈ రుణానికి ప్రతిగా ఐఎమ్‌ఎఫ్ వాణిజ్య సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఖర్చుల కోత వంటి కఠినమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయించింది. దీని ద్వారా భారతదేశం మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారినప్పటికీ, ఈ విధానాలు  దేశంలో సామాజిక అసమానతలు పెరిగేలా చేశాయి. భవిష్యత్తులో మరో ఆర్థిక సంక్షోభం వస్తే, ఐఎమ్‌ఎఫ్ నిధుల సామర్థ్యం తగ్గిపోతే, భారత్ వంటి దేశాలు ఆర్థిక అస్థిరతను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం భారత్ ఆర్థిక స్థితి బలంగానే ఉంది. విదేశీ ద్రవ్య నిల్వలతో పాటుగా ఆర్‌బీఐ వద్ద బంగారం నిల్వలు కూడా భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా దేశం ఒకరిపైఆధారపడాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు.ప్రపంచ స్థాయిలో భార్ ఓ బమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగోతంది కూడా. కాబట్టి విదేశీ రుణాలపై పెద్దగా ఆధారపడాల్సిన పని లేదు. 

వామపక్ష ఆర్థికవేత్తలు ఐఎమ్‌ఎఫ్, ప్రపంచ బ్యాంక్‌లను పాశ్చాత్య ఆర్థిక సామ్రాజ్యవాద పరికరాలుగా విమర్శిస్తున్నారు. ఈ సంస్థలు బహుళజాతి సంస్థలకు, ఆర్థికంగా ఉన్నత (ఎలైట్ ) వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై కఠిన ఆర్థిక విధానాలను ఒత్తిడి చేస్తున్నాయని వారు విమర్శలు చేస్తున్నారు.

ఐఎంఎఫ్ రుణం కావాలంటే.. 

ఐఎమ్‌ఎఫ్ రుణం పొందే దేశాలు ఖర్చును తగ్గించుకోవడానికి ప్రజా వ్యయాలకు కోత పెట్టాలి. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాల కోత, పన్నుల పెంపు, ప్రాథమిక సేవల క్షీణత వంటివి చోటు చేసుకుంటాయి. గ్రీస్‌లో (2010 -2015) ఐఎమ్‌ఎఫ్ విధించిన ఆర్థిక కట్టుదిట్టతల వల్ల 25 శాతం ఆర్థిక కోత, 27 శాతం నిరుద్యోగం నమోదు కావడంతో, పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అర్జెంటీనా (2001) ఐఎమ్‌ఎఫ్ విధించిన కఠిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది.

రుణాల ఉచ్చులో  పడిపోతాయి 

ప్రపంచ బ్యాంక్ అధిక వడ్డీ రుణాలు ఇచ్చి, అభివృద్ధి చెందుతున్న దేశాలను దివాలా తీయించే పరిస్థితికి తీసుకువచ్చిందనే విమర్శ ఉంది. జాంబియా, ఘనా వం టి దేశాలు ప్రపంచ బ్యాంక్ రుణ భారం వల్ల ఆర్థికంగా అతలాకుతలం అయ్యాయి. ఐఎమ్‌ఎఫ్ విధానాల ప్రకారం, మొదట అప్పు తీర్చడం, ఆ తర్వాత దేశ ఆర్థిక పునరుద్ధరణ అనే విధానంతో ఇవి ఆర్థికంగా స్వతంత్రత కోల్పోయాయి.

ప్రపంచ బ్యాంక్ బొలివియా (2000) లో నీటి సరఫరా వ్యవస్థను ప్రైవేటీకరించడంతో, ప్రజలు తమ ఆదాయంలో 20 శాతం కేవలం నీటి కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనివల్ల కొచబంబా వాటర్ వార్ అనే ప్రజా ఉద్యమం తలెత్తడంతో ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.

పర్యావరణ నష్టం 

భారతదేశంలో  ప్రపంచ బ్యాంక్ నిధులతో నర్మదా డ్యాం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల లక్షలాది మంది ఆదివాసీలు తమ భూములను కోల్పోయారు. అనేక ప్రజా ఆందోళనలు, మేధా పాట్కర్ నాయకత్వంలో జరిగాయి. ఈ ఉద్యమం వలన ప్రపంచ బ్యాంక్ దీనినుంచి వెనక్కు వెళ్లాల్సి వచ్చింది.

అమెరికా స్థానంలో చైనా

అమెరికా ఐఎమ్‌ఎఫ్, ప్రపంచ బ్యాంక్‌లనుంచి వైదొలగితే, చైనా ఈ ఖాళీని భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్‌ఐ) ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలు అందిస్తోంది.

మొత్తంమీద ఐఎమ్‌ఎఫ్, ప్రపంచ బ్యాంక్‌లకు నిర్మాణాత్మక సంస్కరణలు ప్రస్తుతం అవసరంలేదు. అమెరికా వీటిని వదిలిపెట్టకుండా, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను మెరుగుపరిచే విధంగా తన విధానాలను మార్చుకోవాలి. లేకుంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చైనా ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌లనుంచి అమెరికా వెనక్కు తగ్గడం కాదు, ఈ సంస్థలను సమర్థంగా మారిస్తేనే సమగ్ర ఆర్థిక భద్రత సాధ్యమవుతుంది. లేని పక్షంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ కుదుపునకు గురయ్యే ప్రమాదం ఉంది.

వ్యాసకర్త సెల్ : 9849328496

డా. కోలాహలం రామ్ కిశోర్