2 July, 2026 | 3:30 AM

‘ప్రతి ఇంటికి పట్టా.. ప్రతి కుటుంబానికి ఇల్లు’ నినాదంతో పోరుబాట

02-07-2026 02:23 AM

పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేసేవరకు ఉద్యమం 

కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో స్థలాలు క్రమబద్ధీకరించి హక్కు కల్పించాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, 

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ఇండ్లు, ఇండ్లస్థలాల కోసం కలెక్టరేట్ ఎదటు వామపక్షాల ధర్నా 

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 1 (విజయక్రాంతి): ’ప్రతి ఇంటికి పట్టా.. ప్రతి కుటుంబానికి ఇల్లు’ అనే నినాదంతో లాల్ జెండా పార్టీలు ప్రారంభించిన పోరుబాట, లక్ష్యం నెరవేరేవరకు ఆగబోదని, పేదలకు గూడు కల్పించేవరకు పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

సిపిఐ, సిపిఎం, న్యూ డిమోక్రసీ, మాస్ లైన్ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వామపక్షాల నాయకులు, కార్యకర్తలు, ఇండ్లు లేని వేలాది మంది పేదలు భారీ సంఖ్యలో కలెక్టరేట్కు తరలివచ్చి నాలుగు గంటలపాటు ఉదృతంగా ధర్నా కొనసాగించారు. ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైన కూనంనేని మాట్లాడారు.

నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేసేవరకు వామపక్షాల ఆధ్వర్యంలో సాగే ఈ ప్రజా ఉద్యమం ఎంతమాత్రం ఆగదని స్పష్టం చేశారు. కొత్తగూడెం పట్టణ పరిధిలో జీవో నెంబర్ 76ను తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేసి, అర్హులైన నిరుపేదలందరికీ పట్టాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా పాల్వంచ పరిధిలోని జీవో నెంబర్లు 444, 999, 817, 727, 410 పరిధిలో దశాబ్దాలుగా నమ్ముకుని ఉన్న స్థలాలను తక్షణమే రెగ్యులరైజ్ చేసి అర్హులకు పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం సాయిబాబు మాట్లాడుతూ పేదలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇండ్ల కూల్చివేత చర్యలను తక్షణమే మానుకోవాలని, ప్రభుత్వ నిరంకుశ కూల్చివేతలను పేద ప్రజలందరూ ఐక్యంగా ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేదలు నిర్మించుకున్న ఇండ్లకు వెంటనే ఇంటి నెంబర్లు జారీ చేయాలని, తాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటి కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. 

న్యూ డిమోక్రసీ జిల్లా నాయకులూ గౌని నాగేశ్వరరావు, మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కెచ్చల రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, లేనిపక్షంలో కలెక్టరేట్లను, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు, సరెడ్డి పుల్లారెడ్డి, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, సిపిఎం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య, వామపక్ష పార్టీల జిల్లా నాయకులు నరాటి ప్రసాద్  పాల్గొన్నారు.