2 July, 2026 | 3:17 AM

ఆకాశం దిక్కు రైతన్న చూపు!

02-07-2026 02:24 AM
  1. ముఖం చాటేసిన వరుణుడు 
  2. జూన్‌లో సాధారణం కంటే తక్కువే.. 
  3. జూలై పైనే అన్నదాతల ఆశలు

కరీంనగర్, జూలై 1 (విజయక్రాంతి): జూన్ నెలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాధారణం కంటే   తక్కువ వర్షపాతం  నమోదైంది. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం, బలహీనంగా సాగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. , వర్షపు రోజులు కూడా పరిమితంగానే నమోదయ్యాయి. దీంతో ఖరీఫ్ సాగుపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.కరీంనగర్ జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 209.6 మిల్లీమీటర్లు కాగా, ఈసారి కేవలం 139.6 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది.

ఇది సాధారణం కంటే 33 శాతం తక్కువ. జిల్లాలో నెల మొత్తం మీద కేవలం తొమ్మిది రోజులే వర్షాలు కురిశాయి.జగిత్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం 153.3 మిల్లీమీటర్లు ఉండగా, 110.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 28 శాతం తక్కువ. జిల్లాలో ఎనిమిది రోజుల పాటు మాత్రమే వర్షాలు కురిశాయి.పెద్దపెల్లి జిల్లాలో సాధారణ వర్షపాతం 158.3 మిల్లీమీటర్లు కాగా, 136.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 14 శాతం తక్కువ. జిల్లాలో తొమ్మిది రోజుల పాటు వర్షాలు కురిశాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాధారణ వర్షపాతం 127.0 మిల్లీమీటర్లు కాగా, 90.9 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 28 శాతం తక్కువ. జిల్లాలో ఎనిమిది రోజులే వర్షాలు కురిశాయి.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతంతో పోలిస్తే లోటు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జూన్ నెలలో ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల పాటు మాత్రమే వర్షాలు కురవడం వల్ల ఖరీఫ్ సాగు పనులు మందగించే పరిస్థితి నెలకొంది.

రైతులు జూలై నెలలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు అనుకూలంగా కురిస్తే సాగు పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని వ్యవసాయ, వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.జులై మొదటి వారంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.