మగవారిని ఇంట్లోనే తాగమనండి
30-06-2024 01:44 AM
మహిళలకు మధ్యప్రదేశ్ మంత్రి సలహా
భోపాల్, జూన్ 29 : మగవారితో మద్యం మాన్పించేందుకు మధ్యప్రదేశ్ మంత్రి నారాయణ్ సింగ్ కుశ్వాహా ఓ అద్భుతమైన చిట్కా చెప్పారు. ఈ చిట్కాను పాటించే ఆడవారు తమ భర్తలను మద్యపానం నుంచి విముక్తి చేయవచ్చన్నారు. మద్యపానం, మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టే లక్ష్యంతో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “ఆడవారు తమ ఇంట్లోని పురుషులను మద్యం మాన్పించాలంటే.. ముందుగా వారిని బయట తాగొద్దని చెప్పండి. ఆ మద్యాన్ని ఇంటికి తెచ్చుకొని, మీ ముందు కూర్చొని తాగమనండి. కుటుంబసభ్యుల ముందు మద్యం తాగితే.. ఆ అలవాటు వారిలో క్రమంగా తగ్గుతుంది. తర్వాత రోజుల్లో దానికి పూర్తిగా దూరం అవుతారు. ఎందుకంటే, మగవారు తమ భార్యాపిల్లల ముందు తాగడానికి సిగ్గుపడతారు’ అని చెప్పారు.






