20 June, 2026 | 3:32 AM

ఉపాధి అందించేలా తయారు చేద్దాం: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం

20-06-2026 01:44 AM

మహబూబ్ నగర్ జూన్ 19 (విజయ క్రాంతి) : నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  సూచించారు. శివం కన్వెన్షన్ సెంటర్ లో పారిశ్రామికవేత్తల అవగాహన ప్రత్యేక విక్రేతల అభివృద్ధి కార్యక్రమం లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిఐసిసిఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 

ఈ సందర్బంగా మాట్లాడుతూ యువత తమ ఆసక్తులు, అర్హతలకు అనుగుణంగా సాఫ్ట్వేర్ సేవలు, రిటైల్ వ్యాపారాలు, నెట్వర్కింగ్ సేవలు తదితర రంగాల్లో వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని, అటువంటి వారికి తోడ్పాటు అందించాలని సూచించారు. ప్రభుత్వం యువత సాధికారత కోసం పలు పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన యువత వాటిని వినియోగించుకోవా లని సూచించారు.

వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన రుణాల కోసం బ్యాం కులు ప్రాజెక్టు నివేదికలు, విద్యార్హతలు, వ్యాపార ప్రణాళికలను పరిశీలిస్తాయని తెలిపారు. అందువల్ల యువత సరైన ప్రణాళికతో, ఆచరణ సాధ్యమైన వ్యాపార నమూనాలతో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. యువతకు మార్గదర్శనం, ప్రోత్సా హం అందించి స్వయం ఉపాధి రంగంలో విజయవంతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. 

యువత తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడంతో పాటు ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. బ్యాంకులు సైతం ఎదిగే వారికి సహాయం చేయడానికి సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు.  ఇప్పటికే వ్యాపారంలో స్థిరపడిన పారిశ్రామిక వేత్తలకు కోట్ల రూపాయలు లోన్లు ఇస్తారు కానీ ఎదిగేందుకు అవకాశం ఉండేవారికి మాత్రం బ్యాంకులు ఆటంకం కల్పించడం ఆవేదన కలిగిస్తోందని, కానీ కొన్ని దేశాల్లో యువత లోన్లు కావాలని వస్తే వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సహాయం చేస్తాయని అన్నారు. 

 భవిష్యత్తులో యువతకు అవసరమైన శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తామంటే దానికి తన సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. నగర మేయర్  గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్, నిర్వాహకులు సీతారాం , కుసుమ, తదితరులు పాల్గొన్నారు