calender_icon.png 14 May, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం

12-04-2025 12:00:00 AM

ఘనంగా మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

జిల్లా కేంద్రంలో విగ్రహం ఏర్పాటుకు చర్యలు

కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): బడుగు, బలహీన వర్గాలు, దళిత, గిరిజన ప్రజల సంక్షేమం కోసం, స్త్రీ-పురుష సమానత్వం కోసం అంకిత భావం తో కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాఫూలే ఆశయాలను కొనసాగిద్దామ ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం  కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబాపూలే 198వ జయంతి వేడుకలకు  ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, మాలి కుల సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి మహాత్మా జ్యోతిబాపూలే చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన, దళిత, గిరిజన ప్రజల సంక్షేమం, స్త్రీ-పురుష సమానత్వం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహా త్మ జ్యోతిబాపూలే అని అన్నారు. సమగ్ర ఆధునిక అవగాహన కలిగిన మహోన్నత వ్యక్తి, సమానత్వం, సమ సమాజం కోసం 2 శతాబ్దాల క్రితమే పోరాటాలు చేసి ప్రజలను చైతన్యవంతం చేశారని తెలిపారు. కుల వివక్షను ప్రత్యక్షంగా అనుభవించిన పూలే, వివక్షను అంతం కావాలని పరితపించారని, అసమానతలు, కుల వ్యవస్థ అంతం చేయాలని ఆనాడే నిర్ణయించుకుని పోరాటాలు చేశారని తెలిపారు.

మహిళలు చదవకూడదు అనే ఆంక్షలు ఉన్న ఆ రోజుల్లో తన భార్య సావిత్రిబాయికి తానే గురవై ఈ దేశానికి తొలి మహిళ ఉపాధ్యాయురాలిని అం దించారని అన్నారు. జిల్లా కేంద్రంలో పూలే విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇలాంటి మహనీయుల చరిత్ర భావితరాల వారికి అందించాలని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్త్రీల హక్కుల కొరకు పోరాడి స్త్రీలకు విద్య అందించిన మహనీయుడని తెలిపారు. మాలి కుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సజీవన్, మాజీ జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్రావు, కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాం నాయక్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాధవేని మల్లేష్, మాలి కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సెండే వాసు, నగోషా శంకర్,  బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రూప్ నార్ రమేష్, ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు కేశవరావు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బదిలీ సత్యనారాయణవివిధ కులాల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.