సత్సంబంధాలు నెరపుదాం
విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం
ఏపీ కాబోయే సీఎం చంద్రబాబుకు రేవంత్ అభినందనలు
సీఎంను కలిసిన పలువురు తాజా ఎంపీలు
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ సమస్యలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహక రించాలని కోరారు.
గురువారం మధ్యా హ్నం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఫలితాలపై సీఎం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో రేవంత్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన పలువురు ఎంపీలు, వారి కుటుంబసభ్యులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. మహబూబాబాద్ ఎంపీ పొరిక బలరాంనాయక్, పలువురు ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు.
ఈ సందర్భంగా ఎంపీగా గెలిచిన బలరాంనాయక్‌ను సీఎం అభినందించారు. పెద్దపల్లి ఎంపీగా గెలిచిన గడ్డం వంశీకృష్ణ, ఆయన తండ్రి ఎమ్మెల్యే గడ్డం వివేక్ తదితరులు రేవంత్‌రెడ్డిని గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను శాలువాతో సత్కరించారు. వారి వెంట మంత్రి పొంగులేటి తదితరులు ఉన్నారు.






