4 May, 2026 | 2:44 AM

విపత్తులకు ముందే మేల్కొందాం!

01-06-2024 12:05 AM

‘వృక్షో రక్షతి రక్షితః’ అన్నది పెద్దల నానుడి. అంటే చెట్టు ను మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని అర్థం. అయితే ఇటీవలి కాలంలో చెట్లను నరకడం తప్పితే వాటిని కాపాడడం అరుదై పోయింది. నగరాలు, పట్ట ణాలు కాంక్రీట్ జంగిల్స్‌గా మారే  క్రమం లో అడ్డువచ్చిన చెట్లను ఇష్టం వచ్చినట్లు నరికేస్తున్నారు.దాని స్థానంలో మరో చెట్టు పెరగడం లేదు. ఫలితంగా  వాతావరణ సమతుల్యం దెబ్బతింటోంది. వర్షాకాలం లో  కుండపోత వర్షాలు వచ్చి వరదల్లో  ఇండ్లు, కాలనీలు మునిగిపోతున్నాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి.  వరద నీటిలో పలువురు  చనిపోతున్నారు. 

ఇక వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా వేసవిలో అధిక ఉఫ్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి ఏటా ఒకటి రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతోంది. గతంలో వేసవి అది కూడా రోహిణి కార్తెలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతే అధిక ఉష్ణోగ్రతగా  ఉండేది. కానీ ఇప్పుడు 50 డిగ్రీలు సర్వ సాధారణమై పోయింది. మే 29 నాడు దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇంకా, ఆశ్చర్యకరమైన విషయమేమిటం టే, నాగపూర్‌లో 56 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు తాజా సమాచారం. రాజస్థాన్‌కు చెందిన ఫలోడిలో 51 డిగ్రీల సెల్సియస్, హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

సాధారణం గా దుబాయి లాంటి ఎడారి ప్రాంతాల్లో ్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఇప్పటివరకు మన భూమిమీద నమోదయిన అత్యధిక ఉఫ్ణోగ్రత 56.7డిగ్రీల సెల్సియస్.. అమెరికాలోని డెత్‌వ్యాలీలో 1913 జూలై 10న నమోదయింది.  దుబాయిలో సైతం వేసవిలో 50 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉంటాయి, రాజస్థాన్. ఢిల్లీ, హర్యానా ఇవన్నీ కూడా థార్ ఎడారి చుట్టుపక్కల ప్రాంతాలే.   కానీ ఇప్పుడు  మహారాష్ట్రలోని నాగపూర్‌లో 56 డిగ్రీలు నమోదయినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే మన నగరాలు ఎడారుల స్థాయికి చేరుకున్నాయా? ఇంకోప్రక్క మణిపూర్‌లోవరదలు. ఇవన్నీ వాతావరణ మార్పులకు ఒక హెచ్చరిక లాంటిదనే విషయం తెలుసుకోవాలి. రాబోయే రోజులలో దేశవ్యాప్తంగా ఏ రకమైన విపత్తుల ను ఎదుర్కోవలసి ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ఇటు అధిక వేడి, అటు తుపానులు, వరదలు. 

తీవ్రస్థాయి వాతావరణ అరిష్టాలు సంభవించినప్పుడు ప్రజల ఆందోళన ఇంతా అంతా కాదు. మళ్లీ కొన్ని రోజుల తరువాత షరా మామూలే! ఇలా జరగడానికి కారణాలు మనకందరికీ తెలుసు. ఢిల్లీ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదుకు కారణం రాజస్థాన్ నుండి వీస్తున్న వేడి తేమతో కూడిన గాలులుగా నిపుణు లు చెబుతున్నారు. అవి ముందు గా ఢిల్లీ శివార్లను తాకడం వల్లే  అంత అధిక ఉష్ణోగ్రతలు తలెత్తుతున్నాయని అంటున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అధికంగా రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వేడి పవనాలు  పెరుగుతున్నాయి.

సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో హీట్‌వేవ్ ప్రకటించబడుతుంది. ఒక స్టేషన్ గరిష్ట ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాలలో కనీసం 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ, తీరప్రాంత స్టేషన్లలో 37 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ, కొండ ప్రాంతాలలో కనీసం 30 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ వున్నప్పుడు ఆ పరిస్థితిని ‘హీట్ వేవ్స్’ గా శాస్త్రవేత్తలు పరిగణిస్తారు. మన దేశం చాలా కాలంగా హీట్ వేవ్‌ల బారిన పడిం ది. గత కొన్ని దశాబ్దాలుగా పెరిగిన వాతావరణ మార్పుల మూలంగా వేడి పవనాల ప్రభావం గణనీయంగా పెరిగింది. రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు హీట్‌వేవ్స్ కారణంగా ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి.

అధికోష్ణ పవనాలకు కారణాలు

హీట్ వేవ్స్ పెరగడానికి సహజ కారణాలుగా అధిక వాతావరణ పీడన వ్యవస్థలు, ఎల్‌నినో,లానినో వాతావరణ వైవిధ్యాలు, కరువు, పొడి పరిస్థితులు, గాలి రవాణాలో మార్పులు, భౌగోళిక పరిస్థితులు మొదలైన వాటిని నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ కూడా అధిక ఉష్ణోగ్రతల ప్రధాన కారణాలలో మరొకటి. మానవ తప్పిదాలలో భాగంగా శిలాజ ఇంధనాల అధిక వినియోగం ఒక పెద్ద సమస్యవుతున్నది. అటవీ నిర్మూలన మరో తీరని లోటుగా మారింది. ప్లాస్టిక్‌ల వాడకం తగ్గడం లేదు. హరిత వాయువుల కారకాలైన అనేక ప్రకృతి విరుద్ధ పనులను మానవాళి మానడంలేదు. అధిక జనసాంద్రత కలిగిన పట్టణ ప్రాంతాలు, భవనాలు, కాంక్రీటు ఉపరితలాలు ఎక్కువ వేడిని గ్రహించి నిలుపుకుంటాయి. ఇది అధిక ఉష్ణోగ్రతలకు దారితీస్తుంది. సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ లేదా అంత కంటే ఎక్కువ ఉన్న ప్పుడు ఒక ప్రాంతంలో హీట్‌వేవ్ ప్రకటించబడుతుంది. 

వినాశకర పర్యవసానాలు

హీట్ వేవ్స్ పెరుగుదల శారీరక అనారోగ్యాలను కలిగిస్తుంది. విద్యుత్ డిమాండ్ పెరిగి గ్రిడ్ విఫలం అవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తాయి. నీటి వనరులపై దీని ప్రభావం ఉంటుంది. చెరువులు, కుంట లు, బావులు, బోరింగ్‌లు ఎండి పోవడంతో వ్యవసాయం, గృహావసరాలకు నీటి లభ్యత కొరత తీవ్రమవుతుంది. కరవుల సంభావ్యతను ఇవన్నీ పెద్ద ఎత్తున పెంచుతాయి. సాగునీటికి డిమాండ్ కూడా తీవ్రస్థాయిలో పెరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తిపైనా ప్రభావం పడుతుంది. ఉష్ణోగ్రతల పెరుగుదల ఆహార అభద్రతను పెంచుతుంది. ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ ప్రకృతిలో మరింత తీవ్రతర వేడి పవనాల పెరుగుదల మానవ ఆరోగ్యంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపి, అకాల మరణాల సంఖ్యను పెంచుతుంది.

పరిష్కారం మన చేతుల్లోనే!

ఇటువంటివి రాకుండా మనం ఏం చేయాలి? ఏమేం చేయకూడదు? వీటిని ఎలా పరిష్కరించాలి? వంటివి ఆలోచించి, ఆచరణలో పెట్టాలి. మనం మన ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ తీసుకుంటామో అంతే సానుకూల దృష్టిని పర్యావరణ ఆరోగ్యం మీద కూడా పెట్టాలి. ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్’ అనేది ప్రకృతికి కూడా వర్తింపజేయాలి. ఎందుకంటే, మనం జీవించాలంటే వాతావరణం సహకరించాలి. లేదంటే, మన మనుగడకే ప్రమా దం. ముందుగా ఇటువంటి విపత్తులను సామాజిక సమస్యలుగా పరిగణించాలి. విపత్తులు వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు తక్షణ ఉపశమనం కోసం ఖర్చు పెడతారు. ఈ విపత్తులకు కారణాలు మనకు తెలుసు. అందువల్ల ముందుగానే మేల్కొని అవి రాకుండా దీర్ఘకాలిక చర్యలను చేపట్టాలి. దీనివల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందొచ్చు. ప్రజలకు ముందు అవగాహన కలిగించాలి. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ బాగుకోసం పనిచేయాలి. 

ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వాడకం విపరీతంగా పెరుగుతున్నది. ఫలితంగా విద్యుత్తు వినియోగం అధికమవుతున్నది. ప్రతీ ఒక్క రూ అలాగే, ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్టుగా వ్యవరిస్తున్న పరిస్థితిని చూస్తు న్నాం. ప్రకృతి మాత్రం ఎంతకని భరిస్తుంది? తరువాత తన పని తాను చేసు కుంటుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం బాగా చదివిస్తాం. ఆస్తులు కూడబెట్టి ఇస్తాం. కానీ, వారు సుఖంగా జీవించాలంటే పర్యావరణం కోసం సహకరించా లనే విషయం మర్చిపోతున్నాం. కనుకే, ప్రతీ ఒక్కరూ ఏదో విధంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.

వ్యాసకర్త సెల్: 8247045230