గాడిదలో దైవ దర్శనం!
ఆయన పన్నెండు భాషల పండితుడు. జీవితంలో కష్టసుఖాల పారమెరిగిన వాడు. లాభనష్టాలు, శీతోష్ణాలు, మానావమానాలు, సుఖదుఃఖాల నే ద్వంద్వాలను అధిగమించిన వాడు. అతని పేరు గుండేరావ్ హర్కారే. నిజాం కాలంలో సెషన్స్ జడ్జిగా పని చేసిన వాడు. గద్వాల సంస్థానంలో ఆస్థాన పండితుడు. అతని నివాసం గౌలిపురా అంటే ఓల్డ్ సిటీ. అంతటి పండితుని ఇల్లు పెద్ద భవనమేమీ కాదు, రేకుల ఇల్లు. ఎనభై ఏళ్ల వయసులో అతనికి చేయూత నిచ్చేది ఒక్క కర్ర మాత్రమే. ఉదయం లేవగానే కర్ర సాయం తో కొద్దిసేపు వాకింగ్ చేయడం ఆయనకు అలవాటు. ఆప్పుడప్పుడు ఆయన ఇంటికి సమీపంలో అద్దె ఇంట్లో వున్న నా దగ్గరకి నడచుకుంటూ వచ్చేవాడు.
ఆ పండితుణ్ణి నేను “తాతయ్యా!” అని ప్రేమతో పిలిచే వాణ్ణి. ఎప్పుడైనా పొద్దున్నే ఇంటి ముందుకు వస్తే, “తాతయ్యా! మీరు పొద్దున్నే రావాలా? నన్ను రమ్మంటే వస్తాను కదా?” అనేవాణ్ణి. దానికి సమాధానంగా ఆయన, “మనకు ఓ పని ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్లమైనా మనమే వెళ్లాలి. ఎదుటివారు చిన్నవాళ్లనుకోవద్దు. అట్లా అనుకుంటే మన పని కాదు” అనేవారు. నిజంగా వారు చెప్పిన మాటలు జీవిత పాఠంగా భావిస్తూ నా శిష్యుల ద్వారాను ప్రయోజనం పొందాను.
ఒకరోజు గుండేరావు గారు తమ ఇంటిముందు నిలబడి ఉన్నారు. చేతిలో కర్ర లేనట్లుంది. అంత పొద్దున్నే ఎక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిందో ఒక గాడిద వారిని తన్ని పారిపోయింది. గుండేరావు గారు కిందపడి పోయారు. ఆ పక్కవాళ్లు ఈ పక్కవాళ్లు గుమికూడారు. ఇంట్లో వున్నవాళ్లు బయటికి వచ్చి గుండేరావ్ గారిని చూసి బాధ పడ్డారు. కింద పడడం వల్ల కాళ్లకు, చేతులకు దెబ్బలు తగిలాయి. సున్నం తెచ్చి అక్కడక్కడా రాస్తున్నారు. అసలే, గుండేరావ్ స్థూలకాయులు. ఎర్రని శరీరం. దెబ్బ తాకిన చోట శరీరం మరీ కమిలి పోయి మరింత ఎర్రగా మారింది.
అదే సమయంలో ఎవరో ఒకరు, “మీ తాతయ్య కింద పడ్డారు. దెబ్బలు తాకాయి” అని చెప్పగానే, నేను ఉన్న పళా న వారి దగ్గరికి చేరుకున్నాను. “అయ్యో, ఎంత పని అయింది తాతయ్యా” అని కళ్లల్లో నీరు నింపుకున్నాను. సాధారణంగా ఆయన నన్ను ‘కవీశ్వరా!’ అని పిలుస్తారు. యథా ప్రకారం వారు నన్ను చూసి, “కవీశ్వరా! ఒక పని చేస్తావా?” అని అడిగారు. “చెప్పండి తాతగారు! నేనేం చేయాలి?” అన్నాను. వెంటనే వారు, “పేపరూ, పెన్ను తెచ్చుకొని నేను చెప్పింది రాయి” అన్నారు. నేను పెన్ను, పేపర్‌తో వారి ముందు నిలబడగానే సంస్కృతంలో వరుసగా కొన్ని శ్లోకాలు చెప్పి వాటిని చక్కగా రాయమన్నారు. దానికి ‘గార్దభాష్టకం’ అని ఆయన నామకరణం కూడా చేశారు. నేను వారు చెప్పినట్లే రాశాను. ఆ శ్లోకాల తాత్పర్యం ఇదీ.
తెలంగాణ దేవత మడివేలు
‘విష్ణుమూర్తి వాహనం గరుడుడు. విష్ణుమూర్తితోపాటు అతని వాహనమైన గరుడుడు పూజింపదగిన వాడు. ఐనప్పుడు, మా తెలంగాణ దేవత మడి వేలమ్మ. మా మడివేలు దేవత వాహనమైన గార్దభం కూడా పూజనీయమే కదా! శివుని వాహనం నంది. శివునితోపాటు అతని వాహనమైన నంది పూజింపదగిన వాడు. ఐనప్పుడు, మా తెలంగాణ దేవత మా మడివేలమ్మ వాహనమైన గార్దభం పూజనీయమే కదా! బ్రహ్మ వాహనం హంస. బ్రహ్మతోపాటు హంస కొనియాడదగింది. ఐనప్పుడు, మా మడివేలు దేవత వాహనం కూడా ఆరాధింప దగిందే కదా! కుమారస్వామి వాహనం నెమలి.
కుమారస్వామితోపాటు నెమలి కొనియాడదగినదైనప్పుడు మా మడివేలమ్మ వాహనమైన గార్దభమూ పూజింపదగిందే కదా! వినాయకుని వాహనం ఎలుక. వినాయకునతోపాటు ఎలుక గౌరవింపదగిందైనప్పుడు మా మడి వేలమ్మ వాహనమైన గార్దభం గౌరవింపదగిందే కదా! పార్వతి అమ్మవారు వాహనం పులి. పార్వతితోపాటు పులి గౌరవింపదగినదైనప్పుడు మా మడి వేలమ్మ వాహనమైన గార్దభం స్తుతింపదగిందే కదా! ఇంద్రుని వాహనం ఐరావతం. ఇంద్రునితోపాటు ఐరావతం ఆరాధింపబడినప్పుడు మా మడి వేలమ్మ వాహనమైన గార్దభం ఆరాధింపదగిందే కదా!’ ఆ శ్లోకాలు వివరించిన తర్వాత, “మా తెలంగాణ దేవత అయిన మడి వేలమ్మకు ఈ గార్దభం వాహనం కనుక, నాకు అన్ని దేవతల వాహనాలతోపాటు గార్దభం కూడా ఆరాధింపదగిందే” అని గుండేరావు గారు ‘గార్దభాష్టకం’ చెప్పి, శ్లోకాలన్నీ నా చేత రాయించారు. తర్వాత నన్ను వినిపించమన్నారు. వినిపిస్తూ నేను నవ్వుకోవాలో, తాతయ్య పరిస్థితికి దుఃఖించాలో తెలియలేదు.
“ఇదేమిటి తాతయ్యా! ఇన్ని దెబ్బలు తాకాయి. కింద పడడం వల్ల మీకు బాధ కలగడం లేదా?” అని ప్రశ్నించాను. ఆయన నవ్వుతూ “భగవద్గీత చదవలేదా?” అని అడిగాడు. “చదివా”నన్నాను. వెంటనే ఆయన
‘విద్యావినయ సంపన్నే
బ్రాహ్మణే గవిహస్తిని
శుని చైవ శ్వపాకే చ
పండితాః సమదర్శినః ॥
అనే శ్లోకం నాకు వినిపించారు.
“అర్థం తెలుసు కదా!” అని వారే వివరించారు. “విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణునిలోను, గోవులోను, ఏనుగులోను, కుక్కలోను, కుక్క మాంసం వండి తినే వానిలోను సమానంగా భగవంతుణ్ణి చూసేవాడు పండితుడు. ఈ రోజు నేను గార్దభంలోను భగవంతుణ్ణి చూశాను. నాకీ రోజు భగవద్దర్శనమైందని భావిస్తున్నాను. కనుకనే బాధ లేదు. మడి వేలమ్మ రజకులు ఆరాధించే దేవత. ఆ దేవత వాహనం గాడిద. గాడిద నన్ను తన్నినందుకు ఏ మాత్రం బాధ లేదు” అన్నారా యన. గుండేరావు సామాన్యుడు కాడని నాకర్థమైంది. నిజంగా ఆయన పండితుడే. ‘సర్వవ్యాపకుడైన భగవంతుణ్ణి అన్ని జీవుల్లోనూ, అన్ని పదార్థాల్లోనూ సమానంగా చూసేవాడు పండితుడు’ అనే మాటకు గుండేరావు నిదర్శనంగా నిలిచాడు. చాలామంది ఈ గీతా శ్లోకానికి ‘బ్రాహ్మణుణ్ణి, గోవును, ఏనుగును, కుక్కనూ, కుక్క మాంసం వండి తినేవాణ్ణి సమానంగా చూసేవాడు పండితుడు’ అనే అర్థం చెబుతారు. కానీ, అసలైన అర్థం గుండేరావు గారిద్వారా నా చిన్నతనంలోనే నేను తెలుసుకున్నాను.
ఇది నా జీవితంలో మరపురాని సంఘటన. భగవంతుడు ‘ఇందు గలడు అందు లేడు’ అనకుండా అంతటా సహజంగా ప్రకాశిస్తూ ఉంటాడు. వేదాల్లోనూ భగవంతుడు సర్వవ్యాపకుడుగా పేర్కొనబడి నాడు. ఈ రహస్యాన్ని బాల్యంలోనే నాకు తెలియజేసిన గుండేరావు గురువు కావడం నా అదృష్టంగా భావిస్తాను.
వ్యాసకర్త సెల్: 98856 54381






