06-07-2025 12:00:00 AM
ఆధునిక సాంకేతికత మరో సరికొత్త ఆరోగ్య సమస్యను మన నెత్తిమీదికి తీసుకొచ్చింది. ఇప్పటికే చాలామందిని ఇబ్బంది పెడుతున్న ఈ మాయదారి రోగం.. ‘టెక్ట్స్ నెక్’ పేరుతో ఇప్పుడిప్పుడే వైరల్ అవుతున్నది. ఫోన్, ట్యాబ్, కంప్యూటర్ లాంటి పరికరాలను ఎక్కువగా ఉపయోగించేవారికి ఈ వ్యాధి వేధిస్తున్నది. ముఖ్యంగా గంటలకు గంటలు తలను కిందికి వంచి ఫోన్ చూడటం.. కంప్యూటర్ స్క్రీన్‌కే కళ్లను అప్పగించే వారిలో ఈ టెక్ట్స్ నెక్ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నది.
ప్రస్తుత జనాభాలో 18 ఏండ్ల వయసు వారిలో 79 శాతం మంది రోజంతా ఫోన్‌ను తమతోనే ఉంచుకుంటున్నారట. నిద్రపోయే సమయాన్ని మినహాయిస్తే.. కేవలం రెండు గంటలు మాత్రమే ఫోన్‌కు దూరంగా ఉంటున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి కూడా. ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌లో అయినా రోజంతా ఫోన్ స్క్రీన్‌లోనే తలదూర్చి.. గంటలు గంటలు గడిపేస్తున్నారు. దీంతో వారి మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి, మెడ, భుజాలపై తీవ్రమైన భారం పడుతున్నది.
ఎందుకంటే.. మెడను ఎంత ఎక్కువగా వంచుతారో.. దానిపై అంత బరువు పడుతుంది. దాంతో దీర్ఘకాలంలో నొప్పితో పాటు మెడలు, భుజాల కండరాలు బిగుసుకుపోయి.. టెక్ట్స్ నెక్ కు దారి తీస్తున్నది. ఈ సమస్య ఉన్నవారిలో భుజాల మీదుగా బిగుతుగా అనిపించడం, మెడలో నొప్పితో పాటు దీర్ఘకాలిక తలనొప్పి కూడా వేధిస్తుంది. సమస్య అలాగే కొనసాగితే.. నరాలలో వాపు, వెన్నెముక వంగిపోవడం, ఆర్థరైటిక్స్ సమస్యలూ చుట్టుముడతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
నివారణ
ఫోన్, కంప్యూటర్ స్క్రీన్‌ను కంటి స్థాయికి తీసుకురావాలి.
కనీసం ప్రతి 15 నిమిషాలకు ఒక్కసారైనా.. మీ మొబైల్‌ఫోన్ నుంచి విరామం తీసుకోవాలి.
మెడను తిప్పుతూ, పైకి, కిందికి చూస్తూ చిన్నపాటి వ్యాయామాలు చేయాలి.
మెడ, భుజాల కండరాలు బలపడే వ్యాయామాలను ఎంచుకోవాలి.
ఫోన్, కంప్యూటర్ స్క్రీన్ చూసేటప్పుడు తల, మెడను సరైన భంగిమలో ఉంచాలి.
మెడ, వెన్నుపూస ఆరోగ్యానికి సంబంధించిన యోగాసనాలు కూడా మంచి ఫలితం చూపుతాయి.
సమస్య ఎక్కువైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.