calender_icon.png 23 February, 2026 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండాపూర్‌లో ప్రభుత్వ భూమికి విముక్తి

23-02-2026 01:39:00 AM

ఆక్రమించి 5 ఎకరాల్లో విద్యాసంస్థలు, ఎకరా విస్తీర్ణంలో పార్కు ఏర్పాటు

సీఎంసీ, హైడ్రా, విద్యాశాఖ సంయుక్త తనిఖీ

ప్రభుత్వ స్థలానికి తక్షణమే ఫెన్సింగ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని ఖరీదైన ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడి, వాటిని ప్రజాప్రయోజనాల కోసం వినియోగించే దిశగా అధికార యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. కొండాపూర్‌లోని రాజరాజేశ్వరి కాలనీలో విద్యాసంస్థలు, పార్కు కోసం కేటాయించిన 6 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు వచ్చిన ఫిర్యాదులపై ముగ్గురు కీలక కమిషనర్లు ఆదివారం మెరుపు తనిఖీ నిర్వహించారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) కమిషనర్ జీ సృజన, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్  విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆక్రమణదారుల చెరలో ఉన్న భూమికి విముక్తి కల్పించి, దానికి రక్షణ కవచం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజరాజేశ్వరి కాలనీ ఆమోదిత లేఅవుట్ ప్రకారం..

ఇక్కడ మొత్తం 6 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో 5 ఎకరాలను విద్యా సంస్థల స్థాపనకు, ఒక ఎకరాన్ని పార్కు అభివృద్ధికి కేటాయించారు. అయితే, క్షేత్రస్థాయిలో లేఅవుట్ రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి చూడగా, ఈ భూమిలో కొంత భాగాన్ని కొందరు అక్రమంగా ఆక్రమించినట్లు కమిషనర్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తక్షణమే భూమిని డీమార్కేషన్ సరిహద్దులను గుర్తించి, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా చుట్టూ ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు. ఈ స్థలం పూర్తిగా ప్రభుత్వానిదేనని, ఇందులో ప్రైవేట్ వ్యక్తుల జోక్యాన్ని సహించేది లేదని కమిషనర్లు స్పష్టం చేశారు.

ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన ఈ స్థలంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కమిషనర్ స్వజన అధికారులను ఆదేశించారు. 5 ఎకరాల స్థలంలో విద్యా సంస్థల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ను కోరారు. అలాగే, మిగిలిన ఎకరాన్ని తక్షణమే పార్కుగా అభివృద్ధి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.

ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో స్థానిక ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. భూమి తనిఖీ అనంతరం కమిషనర్ సృజన సమీపంలోని మార్కెట్ ప్రాంతాలలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ప్రతి వ్యాపారి తన దుకాణం వద్ద తప్పనిసరిగా డస్ట్‌బిన్ ఏర్పాటు చేసుకోవాలని, చెత్తను రోడ్లపై వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సేకరించిన చెత్తను క్రమం తప్పకుండా స్వచ్ఛ ఆటో వాహనాలకు అప్పగించాలని సూచించారు. నగర పరిశుభ్రత విషయంలో ఎటువంటి అలసత్వాన్ని సహించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు.