calender_icon.png 23 February, 2026 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐసీసీకి ఏటీఎంలా తెలంగాణ

23-02-2026 01:40:08 AM

  1. నిస్సిగ్గుగా ఒప్పుకున్న రేవంత్‌రెడ్డి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎం లా రేవంత్‌రెడ్డి మార్చారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గత రెండేళ్లుగా తెలంగాణ రాష్ర్టం కాంగ్రెస్ పార్టీకి ఏటీ ఎంలా మారిందని తాము గతంలో అనేకమార్లు హెచ్చరించిన విషయాన్ని ఆదివారం సీఎం రేవంత్ రెడ్డే స్వ యంగా నిస్సిగ్గుగా ఒప్పుకున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్ అధిష్ఠానానికి ధారపోస్తూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

రైతన్నలకు, మహిళలకు, యువతకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన 420 హామీల అమలు విషయానికి వస్తే ప్రభుత్వం వద్ద రూపాయి నిధులు లేవని సాకులు చెబుతున్నారని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధికి నిధులు లేవంటున్న సర్కారు, కేవలం రెండేళ్ల కాలంలోనే మూడు లక్షల కోట్ల రూపాయల భారీ అప్పులు తెచ్చిందని, కానీ రాష్ర్టంలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చిన దాఖలాలు లేవని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును ప్రజా ప్రయోజనాలకు వాడకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ర్టంలో సాగుతున్న భూదోపిడీపై స్పందిస్తూ, మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను, లగచర్లలో గిరిజనుల భూములను, చివరకు హెచ్‌సీయూ విశ్వవిద్యాలయ భూములను కూడా వదలడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు.

హిల్ట్ పాలసీ పేరిట పరిశ్రమల భూములను ‘ఎనుముల బ్రదర్స్’ కలిసి అంబుక్క పడుతున్నారని, ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర వనరులను లూటీ చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత పాలనను ‘దండుపాళ్యం ముఠా’ తీరు తో పోల్చిన కేటీఆర్, తెలంగాణను దోచుకోవడం, సొంతానికి దాచుకోవడం, తన పదవిని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి సంచులు మోయడమే రేవంత్‌రెడ్డి ఏకైక అజెండా అని ధ్వజమెత్తారు. ప్రజల కష్టార్జితాన్ని దారిమళ్లిస్తూ రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.