గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
పీఏసీ చైర్మన్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
కూకట్‌పల్లి, జూన్ 30 (విజయక్రాంతి): గ్రంధాలయాలు విజ్ఞాన భాండాగారాలని పీఏసీ చైర్మన్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో నూతనంగా నిర్మించబోయే గ్రంథాలయ భవన నిర్మాణం కోసం రూ. 2 కోట్ల 96 లక్షల రూపాయల నిధులు మంజూరైన సందర్భంగా పిఎసి చైర్మన్ గాంధీని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రెటరీ పి జి వి రాణి మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో గ్రంధాలయ భవన నిర్మాణం రూ. 2 కోట్ల96 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలతో అందరికీ ఆమోదయోగ్యంగా భవనాన్ని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని గాంధీ తెలిపారు. గ్రంథాలయాలు మనిషికి విజ్ఞానాన్ని అందించడంతోపాటు మేదోశక్తిని పదును పెడతా అన్నారు.
మానసిక వికాసాన్ని కలిగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఇవి చదివే అలవాటును పెంపొందించి వ్యక్తుల వ్యక్తిగత వికాసానికి తోడ్పడతాయన్నారు. పుస్తకాలు కొనుగోలు చేయలేని పేద విద్యార్థులకు, పుస్తక ప్రియులకు ఉచితంగా విజ్ఞానాన్ని అందిస్తాయన్నారు. ఏకాగ్రతతో కూడిన అధ్యయనానికి అనువైన వాతావరణాన్ని గ్రంధాలయాలు కల్పిస్తాయని, చరిత్ర, సంస్కృతి, పూర్వకాలం నాటి విలువైన గ్రంథాలను కాపాడి భావితరాలకు అందిస్తాయని తెలిపారు.
నేడు కేవలం ముద్రిత పుస్తకాలకే పరిమితం కాకుండా డిజిటల్ లైబ్రరీ లు, అంతర్జాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని దీనివల్ల ప్రపంచంలో ఎక్కడ వున్న పుస్తకాలను, సమాచారాన్నయినా క్షణాల్లో చదువుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చిందని విద్యార్థులు దీన్ని సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ సత్యనారాయణ, ఈడబ్ల్యుడిఎస్ ఏ ఈ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.






