రక్తదానంతో ప్రాణదానం...
డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు...
మందమర్రి (విజయక్రాంతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరు రక్తదానం ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని మంచిర్యాల ఆర్డీవో, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు కోరారు. జైపూర్ మండలం వేలాల గ్రామంలో క్రీ.శే. గూడూరి వసంత జ్ఞాపకార్థం నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రక్తదానం చేయడం ద్వారా ఒకరు నలుగురి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారని అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని ఆయన స్పష్టం చేశారు. తలసేమియా వ్యాధి గ్రస్తులకు, డయాలసిస్ బాధితులకు ప్రతినెల రక్తం అవసరం ఉంటుందని అన్నారు. బాదితుల కోసం యువత ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషమని వేలాల గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలు నిర్వహించాలని కోరారు.
రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మహేందర్ మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్త దాతల సహకారంతో మంచిర్యాల జిల్లాలో వేలాది మంది ప్రాణాలు కాపాడామన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు దాతల సహకారంతో 1 నుండి 10 వరకు మంచిర్యాలలోని ఆనందా నిలయంలో స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందని పిల్లలు లేని వృద్ధులకు కూడా వృద్ధాశ్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, డాక్టర్ రవి, ఎంపీఓ శ్రీపతి బాబు, ఇరిగేషన్ డిఈ విద్యాసాగర్, ఆసిఫాబాద్ జైల్ వార్డెన్ సుధాకర్, గ్రామ కార్యదర్శి రాకేష్, మాజీ ఉప సర్పంచ్ అట్కపురం రాయమల్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.






