లిక్కర్ కేసు.. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
- ఈడీ, ప్రభుత్వం చర్యలను ఖండించిన వైసీపీ
- బీసీలను అణగదొక్కే చర్యపై విమర్శలు
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం కొండాపూర్‌లో ఆయన ఇంట్లో నుంచి అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు, నగదు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు అరెస్టు అయ్యారు.
వీరిలో కారుమూరి కుమారుడు సునీల్ కుమార్, ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్‌కేసీరెడ్డిలున్నారు. సిగ్మా సప్లు చైన్ సొల్యూషన్‌ను ఉపయోగించుకున్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. మనీలాండరింగ్‌పై కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా కారుమూరి నాగేశ్వరావు అరెస్టును వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఏపీ ప్రభుత్వం వైసీపీలోని బీసీ నేతలే లక్ష్యంగా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విడుదల రజని, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లు ఆరోపించారు.






