సూర్య క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
24-08-2026 12:00 AM
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), ఆగస్టు 23: మండలంలోని తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి ద్వాదశ ఆదిత్యాధి క్షేత్రంలో శ్రావణమాసం ఏకాదశి ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, అర్చనలు జరిపారు.
అనంతరం యజ్ఞశాలలో మహాసౌర హోమం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సత్రంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్ స్వామి, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, కోటిరెడ్డి, ఉప్పల రాజేష్, అర్చకులు భీంపాండే, అంకిత్ పాండే, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






