11 May, 2026 | 2:18 AM

కొత్తగూడెంలో మద్యం మాఫియా

11-05-2026 01:15 AM
  1. మద్యం సిండికేట్లకు అధికారుల వత్తాసు 
  2. గల్లీ గల్లీకో బెల్ట్ షాప్ 
  3. పోలీసుల పైనా మందుబాబుల వీరంగం

భద్రాద్రి కొత్తగూడెం, మే 10, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం తో పాటు, పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో మద్యం సిండికేట్లు రాజ్యమేలుతున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే సిండికేట్లకు చుట్టాలయ్యారనే అంశం సర్వత్ర  చర్చనీయాంశమైంది. గ్రామాల్లో, వార్డుల్లో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా దర్శనమిస్తున్నాయి. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

జిల్లాలోని ప్రతి పట్టణం, పల్లెల్లో అక్రమ మద్యం ఏరులై పారుతుంది. ప్రభుత్వ ఆదాయం కోసం కాకుండా సిండికేట్ల జేబులు నింపేందుకు, అధికారుల మామూళ్ల దాహాన్ని తీర్చడానికి అక్రమ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వెలవడుతున్నాయి. పాల్వంచ ఎక్సైజ్ శాఖ కార్యాలయం అతి సమీపంలోనే బెల్ట్ షాపు కొనసాగటం కోసం మెరుపు.

మామూళ్ల మత్తులో యంత్రాంగం 

ప్రభుత్వం కేటాయించిన మద్యం షాపుల్లో ఉండాల్సిన మద్యం సీసాలు ప్రత్యేకంగా సిండికేట్ కార్యాలయం ఏర్పాటు చేసుకొని నిల్వలు ఉంచి నేరుగా అక్కడి నుంచే బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్న ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతల కంటే తమకు వచ్చే ఆమ్యామ్యాలే కె అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

సిండికేట్లు  నిర్ణయించిన ధరలకే మద్యం అమ్మాలని నిబంధన పెడుతున్న, బెల్టు షాపులకు మద్యం సరఫరా చేయాలంటే ప్రతి షాప్ కు రూ 5వేలు డిపాజిట్ చేయాలని నిబంధన విధించిన అధికారులు మాత్రం కనీసం తనిఖీలు చేయడానికి కూడా సాహసించక పోవడం శోచనీయం. క్షేత్రస్థాయిలో అక్రమాలను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు ఏసీ గదులకే పరిమితమై సిండికేట్ ప్రతినిధులతో లోపాయకారి ఒప్పందాలను కుదుర్చుకోవడం నగ్నసత్యం.

సిండికేట్లదే హవా..

నిబంధనలో ప్రకారం వైన్ షాపులు నిర్ణీత సమయానికే తెరవాలని, ఎమ్మార్పీ ధరలకే అమ్మకాలు నిర్వహించాలని నిబంధనలు ఉన్న వాటిని సిండికేట్లు తుంగలోకి తొక్కి వారు నిర్ణయించిన విధంగానే క్షేత్రస్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ప్రతి బాటిల్ పై ఎమ్మార్పీ కంటే రూ 20 నుంచి రూ 50 వరకు అదనంగా అమ్మకాలు చేస్తూ మందు బాబుల జేబులకు చిల్లులు పొడుస్తున్నారు. మద్యం దుకాణాల్లో దొరకని రకాలు బెల్టు షాపుల్లో దర్శనమిస్తున్నాయి.

పోలీస్ పైనే కత్తితో స్త్వ్రర విహారం 

అక్రమమధ్యం ఏరులై పారుతూ, అడుగడుగునా బెల్ట్ షాపుల నిర్వహణ 3 సోడాలు ఆరు బీర్లుగా విరాజిల్లుతున్నాయి. ఇటీవల మణుగూరు మండల ప్రాంతంలో ఓ మద్యం ప్రియుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై కత్తితో స్త్వ్రర విహారం చేయడం బెల్టు షాపుల ప్రభావాని తేటుతెల్లమ్ చేస్తోంది. అధికారులు వైన్ షాపులకు పర్మిట్ రూములుగా పరిమిషన్ ఇస్తే, షాపు యజమానులు వాటిని బెల్టు షాపుల రీతిలో వినియోగిస్తున్నారు. పాల్వంచ పట్టణ పరిధిలో నవభారతంలోని ఓ వైన్ షాప్ కు అనుమతి ఇచ్చిన పర్మిట్ రూము వైన్ షాప్ తెరవక ముందే పరిమిట్ రూములో మద్యం విక్రయించడం అందుకు నిదర్శనం. 

ప్రజల్లో వెల్లు వెత్తుతున్న ఆగ్రహం 

ఒకవైపు బెల్టు షాపుల హవా, మరోవైపు అక్రమ మద్యం దందా ఫలితంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను కేవలం కాగితాలకే పరిమితం చేస్తూ ,అధికారుల అండ దండలతో సిండికేట్ల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మహిళా లోకం ఈ పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎక్సైజ్ శాఖ పనితీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సిండికేట్ల విధానాన్ని నిర్మూలించకుంటే ప్రజా ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు.