కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సర్కారు.. ప్రమాణం చేసేది వీళ్లే
న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సర్కారు కొలువుదీరనుంది. రాష్ట్రపతి భవన్ లో ఆదివారం రాత్రి 7.15 నిమిషాలకు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందు కు అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. మోదీ వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టనున్న రెండో వ్యక్తిగా రికార్డు సాధించారు. మోదీతో పాటు కేంద్రమంత్రులుగా పలువురు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నీతిన్ గడ్కరీకి మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం. పీయూష్, అశ్వినీ వైష్ణవ్, మాండవీయ, నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య, జితిన్ ప్రసాద్, సరబానంద సోనోవాల్, కిరణ్ రిజిజు, రక్షా ఖడ్సే, మనోహల్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్, జేడియూ నేతలు లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్, చిరాగ్ పాసవాన్, జితన్ రామ్ మాంఝీ, కుమారస్వామి, జయంత్ చౌదరి, ప్రమాణం చేసే అవకాశం ఉంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో 293 స్థానాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్ చూట్టూ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో సీసీ కెమెరాలు, డ్రోన్లతో అడుగడుగునా పటిష్ట నిఘాతో పాటు 5 కంపెనీల కేంద్రబలగాలు, ఎన్ఎస్ జీ కమాండోలు మోహరించారు. రాష్ట్రపతి భవన్ వద్ద 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మోదీ ప్రమాణ స్వీకారానికి సార్క్ సభ్య దేశాల నేతలకు ఇప్పటికే ఆహ్వానం అందగా, ఈ కార్యక్రమానికి ఏడుగురు దేశాధినేతలు, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, షీచెల్స్ నేతలతో పాటు 8 వేల మందికి పైగా ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు.






