19-12-2025 10:16:56 PM
రామాయంపేట: ఈనెల 21న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం రామాయంపేట ఎస్సై బాలరాజ్ అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన, ఇరుపక్షాల సమ్మతితో సులభంగా సమస్యలను పరిష్కరించుకునే అవకాశం అందుబాటులో ఉందన్నారు.
దీర్ఘకాలంగా న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసులు రాజీ చేసుకునే అవకాశమున్న వివిధ రకాల తగాదాలు, భూ వివాదాలు, కుటుంబ సమస్యలు సంబంధించిన తదితర కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం చేయడం జరుగుతుందన్నారు. అనవసరమైన కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు. ఈ అవకాశాన్ని మండల కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలియపరచారు.