ఉన్నత లక్ష్యాలే విజయానికి తొలి అడుగు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి, ఏప్రిల్ 10(విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సూచించారు. శుక్రవారం పఠాన్ చెర్వు మండలం ముత్తంగిలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ తర్వాత ఉండే పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని సూచించారు. విద్యార్థి జీవితంలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అత్యంత కీలక దశగా పేర్కొన్నారు. ఈ సమయంలో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.
ముఖ్యంగా నీట్, జెఈఈ అడ్వాన్స్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ అందిస్తుందని చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రతిష్టాత్మక కళాశాలల్లో సీట్లు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. జీవితంలో ఎదురయ్యే అవాంతరాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని, కష్టపడే వారికి విజయమే ప్రతిఫలమని కలెక్టర్ పేర్కొన్నారు. చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ కూడా ఎంతో అవసరమని ఆమె వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని తరగతి గదులు, స్టోర్ రూమ్, వంటగదిని పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసినచపాతీ మేకింగ్ మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్శనలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కామధేను ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




