4 May, 2026 | 11:24 AM

ప్రచారానికి తెర

31-05-2024 12:05 AM

సుదీర్ఘ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి గురువారం తెరపడింది. చివరి విడతగా 8 రాష్ట్రాల్లోని  57 లోక్‌సభ స్థానాలకు తుది విడతగా శనివారం పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లో 13, పంజాబ్‌లో 13, బీహార్‌లో 8, పశ్చిమ బెంగాల్‌లో 9,  పంజాబ్‌లో 13, కేంద్రపాలిత ప్రాంతమయిన చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ 4, ఒడిశా 6, జార్ఖండ్ 3 స్థానాలకు చివరి దశలో పోలింగ్ జరగనుంది.తుది విడత పోలింగ్ జరిగే స్థానాల్లో ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసి స్థానం కూడా ఉంది. చివరి విడతలో భాగంగా ఒడిశాలోని లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెం బ్లీ స్థానాలకూ పోలింగ్ జరగనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడడంతో మైకుల హోరు, నాయకుల ప్రసంగాల జోరుకు కూడా బ్రేక్ పడింది. 

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ అయిన ఈ ఎన్నికల్లో ప్రచారం అంతా కూడా ప్రధాని మోడీ, విపక్ష నేతల మధ్య వ్యక్తిగత వైరంలా సాగిందనే చెప్పాలి.  దాదాపు 82 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఎన్నికల పర్వంలో  బీజేపీ ప్రచార భారాన్నంతా భుజా న వేసుకున్న మోడీ ఒక్కరే 206 ర్యాలీలు, రోడ్‌షోలలో పాల్గొని ప్రసంగించారు. దేశంలోని  వివిధ భాషలకు చెందిన మీడియా సంస్థలకు  80కి పైగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొనడంతో తన ప్రచారాన్ని ముగించిన ఆయన  రెండు రోజుల పాటు తమిళనాడులోని కన్యాకుమారిలో గడపనున్నారు.

అక్కడి వివేకానంద ధ్యానమందిరంలో ఆయన ధ్యానం కూడా చేస్తారు. అయితే ఈ సారి ప్రధాని తన ప్రచారంలో  ప్రతిపక్షాలు ముఖ్యం గా కాంగ్రెస్ పార్టీపైన, ఆ పార్టీ ముఖ్య నేతలపైన విమర్శనాస్త్రాలు సంధించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మొదట్లో తన పదేళ్ల పాలనలో దేశం సాధించిన ప్రగతి గురించి వివరించడంతో పాటుగా ఈ సారి 400కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని కూడా చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన ముస్లిం రిజర్వేషన్లు,  రాజ్యాంగంమార్పు వంటి వివాదాస్పద అంశాలను ప్రస్తావించడం ద్వారా రాజకీయ చర్చకు తెరలేపారు. ప్రధాని ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాలను ప్రస్తావించడం ద్వారా అసలు సమస్యలను పక్కన పడేలా చేశారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.

ఈ వివాదం ఒక విధంగా బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపిస్తుందేమోనన్న అనుమానాలు రావడంతో ఆ తర్వాత మోడీ  నేరుగా కాంగ్రెస్ నేతలు, బెంగాల్ సీఎం మమత, కేజ్రీవాల్.. ఇలా కొందరిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత ఆరోపణలు సైతం చేశారు. చివర్లో ఆయన తన గురించే ఎక్కువ  చెప్పుకోవడం మొదలు పెట్లారు.  ఇదంతా చూసిన వారికి గెలుపుపై ప్రధానిలో మొదట కనిపించిన ఆత్మ విశ్వాసం లోపించిందా అన్న అనుమానం మొదలైంది. అజాత శత్రువులాంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం ప్రధాని ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారంటే అవి ఏ ధోరణిలో సాగాయో అర్థమవుతుంది.  

ప్రచారం దశ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం  ప్రధాని మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కులమతాల ఆధారంగా ఓట్లు  అడగకూడదని  ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ  ప్రధాని  వాటిని ఉల్లంఘించారన్నారు. గత 15 రోజుల్లో  మోడీ తన ప్రసంగాల్లో  232 సార్లు కాంగ్రెస్ పేరును ,758 సార్లు తన పేరును తలచుకున్నారని, నిరుద్యోగ సమస్య గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదంటూ ఎద్దేవా చేశారు.  స్పష్టమైన మెజారిటీతో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.  మిగ తా ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఈ సారి బీజేపీ అధికారంలోకి రావడం కష్టమేనంటూ జోస్యాలు చెప్పారు. 

ఎవరి మాటలు ఎలా ఉన్నా శనివారం చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్  దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై స్థూలంగా ఒక అంచనాను అందించనున్నాయి.