ముగిసిన లోక్‌సభ ఎన్నికలు
ఏడు దశల్లో 543 స్థానాలకు పోలింగ్
ఏప్రిల్ 19న మొదటి దశతో మొదలు
జూన్ 1న ఏడో దశతో సంపూర్ణం
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకూ పోలింగ్
న్యూఢిల్లీ, జూన్ 1: సుదీర్ఘంగా సాగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ శనివారంతో ముగిసింది. 543 లోక్‌సభ స్థానాలకు దాదా పు నెలన్నరపాటు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మొదటిదశ పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహించగా, ఏడో దశ పోలింగ్ జూన్ 1న పూర్తయ్యింది. ఈ ఎన్నికల్లో దేశంలో 96.9 కోట్ల మంది ఓటర్లుండగా, ఈ ఎన్నికల్లో ఎంతమంది ఓటు వేశారన్న పూర్తి డాటాను ఎన్నికల సంఘం వెల్లడించాల్సి ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల నిర్వహణకు దాదాపు రూ.1 లక్ష కోట్లు ఖర్చు అయ్యింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించారు.
ఏడో దశలో 61.89 శాతం పోలింగ్
శనివారం ఎనిమిది రాష్ట్రాల్లో 57 స్థానాలకు నిర్వహించిన పోలింగ్‌లో 61.89 శాతం ఓట్లు పోలైనట్టు ప్రాథమికంగా తెలిసింది. ఈ 57 స్థానాల్లో 907 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.






