ఇండియాకు 295 సీట్లు
మాకు స్పష్టమైన మెజారిటీ వస్తుంది
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే
ఇండియా కూటమి సమావేశం
న్యూఢిల్లీ, జూన్ 1: ఇండియా కూటమికి లోక్‌సభ ఎన్నికల్లో 295 సీట్లకు పైగా రాబోతున్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. తమ కూటమే అధికారంలోకి రాబోతున్నదని పేర్కొన్నారు. సుదీర్ఘంగా సాగిన ఏడు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ శనివారం ముగియటంతో పాటు అదే రోజు ఎగ్జిట్ పోల్స్ వెలువడటంతో ఇండియా కూటమి ఢిల్లీలో సమావేశమైంది. రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో భాగస్వామ పార్టీల నేతలంతా పాల్గొన్నారు.
ఎగ్జిట్‌పోల్స్‌పై టీవీ చానళ్లలో జరిగే చర్చకు హాజరు కాబోమని మొదట కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ.. కూటమిలోని ఇతర పార్టీలు చర్చలో పాల్గొంటేనే మంచిదని అభిప్రాయపడటంతో కాంగ్రెస్ కూడా మనసు మార్చుకొ న్నది. ‘అనుకూలతలు, ప్రతికూలతలను బేరీజు వేసుకొన్న తర్వాత కూటమిలోని అ న్ని భాగస్వామ్య పక్షాలు ఎగ్జిట్‌పోల్స్ చర్చల్లో పాల్గొనాలని ఏకగ్రీవంగా తీర్మానించాయి’ అని ఖర్గే తెలిపారు. ‘వాళ్లు (ఎన్డీయే) అమ్ముకోవాలని చూస్తున్న కథల్లోని నిజాలను బయటపెట్టేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ప్రతిపక్ష కూటమి 295 సీట్లు గెలువబోతున్నది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 235 సీట్ల వద్దే ఆగిపోతుంది’ అని సమావేశం అనంతరం మీడియాతో ఖర్గే తెలిపారు.
హాజరైంది వీరే..
సమావేశానికి ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ నేతలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, జార్ఖండ్ సీఎం చంపయ్ సొరేన్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ (ఎంఎల్) దీపాంకర్ భట్టాచార్య తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు.
సమావేశానికి వీరు డుమ్మా..
పలువురు ఇండియా కూటమి నేతలు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. అయితే డీఎంకే తరఫున టీఆర్ బాలు హజరయ్యారు.






