భర్తల గెలుపు కోసం సతుల ఆరాటం

18-04-2024 03:00:25 AM

l ప్రజల బాట పట్టిన అభ్యర్థుల సతీమణులు

l బీఆర్‌ఎస్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న చేవెళ్ల చెల్లెమ్మ

మహేశ్వరం, ఏప్రిల్ 17 : అభ్యర్థుల గెలుపు కోసం భార్యలు రాజకీయ ప్రచారంలోకి దిగారు. ఓ పక్క కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే మరోపక్క భర్తల గెలుపు కోసం భార్యలు ప్రచారం చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి గడ్డం రంజిత్‌రెడ్డి బరిలో దిగారు. పార్టీ శ్రేణుల మద్దతుతో కుల, మతాల సమీకరణాలను అంచనా వేస్తూ ప్రచారం జోరు పెంచారు. అయితే ఇదంతా రాజకీయ ఉనికి కోసమే అయినప్పటికీ భర్తల గెలుపుకోసం వీరి భార్యలు కూడా ప్రచార రంగంలో దిగడం ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు.

బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భార్య సంగీతారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి సతీమణి సీతారెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. మండుటెండలను కూడా లెక్క చేయకుండా చేవెళ్ల పార్లమెంట్‌లో సుడిగాలిలా తిరుగుతున్నారు. భర్తల గెలుపు కోసం తమవంతు సహాయం అందిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి సతీమణి సీతారెడ్డికి బడంగ్‌పేట్ మున్సిపల్ మేయర్ చిగురింత పారిజాత ప్రచారంలో తోడుగా ఉంటుంది.

ఇద్దరి అభ్యర్థుల ప్రచారం ఇలా ఉంటే చేవెళ్ల చెల్లెమ్మగా బ్రాండ్ సొంతం చేసుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేవెళ్లలో తన సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కోసం సబితా ఇంద్రారెడ్డి పక్కా ప్లాన్‌తో ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లు బీఆర్‌ఎస్ శ్రేణులు అంటున్నారు. మొత్తం మీద చేవెళ్ల పార్లమెంట్ బరిలో దిగిన అభ్యర్థులను గెలిపించేందుకు ముగ్గురు ఆడపడుచులు ప్రచారం నిర్వహించడం మహేశ్వరం నియోజకవర్గంలో హాట్ టాఫిక్‌గా మారింది.