02-08-2025 01:26:33 AM
నియామకమైన పోస్టులోనే రిటైర్మెంట్
30 ఏళ్లుగా పదోన్నతులులేని డ్రైవర్లు, కండక్టర్లు
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): సాధారణంగా ఏదైనా ఉద్యోగంలో చేరిన వారికి కనీసం మూడేళ్లకో, ఐదేళ్లకో లేక పదేళ్లకో పదోన్నతి వస్తుంది. ఆయా శాఖల్లో ఉన్న నిబంధనల మేరకు ఉద్యోగులైనా, కార్మికులైనా పదోన్నతులు తప్పనిసరి. కానీ ఆర్టీసీలో మాత్రం సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచే కార్మికుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్ తదితర కిందిస్థాయి సిబ్బందికి 30 ఏళ్లు దాటినా పదోన్నతులు ఉండటం లేదు.
ఫలితంగా గొడ్డు చాకిరీ చేసి చివరకు అదే పోస్టులోనే రిటైరై పోవాల్సి వస్తోందని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. అయితే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియామకమయ్యే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ (టీఐ 3) పోస్టు నుంచి ఆ పైస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు మాత్రం క్రమం తప్పకుండా పదోన్నతులు కల్పిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని కార్మికులు చెబుతున్నారు.
పదోన్నతులు ఇవ్వాల్సింది ఇలా
ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ తదితర కార్మికులు ఉద్యోగంలో చేరాక 12 ఏళ్ల తర్వాత మొదటి ప్రమోషన్ ఏడీసీ కంట్రోలర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 5 ఏళ్ల లోపు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్-3 పదోన్నతి ఇవ్వాలి. అక్కడి నుంచి మరో 3 ఏళ్ల తర్వాత టీఐ-2 పదోన్నతి, ఆ తర్వాత రెండేళ్లకు ఎస్‌టీఐ పోస్టు దక్కాలి. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకోసారి సీఐ, డీఎం, డిఫ్యూటీ ఆర్‌ఎం, ఆర్‌ఎం, ఈడీ వరకు పదోన్నతులు ఇవ్వాలని ఆర్టీసీలో నిబంధనలున్నాయని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.
వాస్తవంగా జరుగుతున్నదేమిటి?
అయితే ఆర్టీసీలో గత 30 ఏళ్ల క్రితం నియామకమైన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు సేమ్ అదే పోస్టులో రిటైర్ అయి పోతున్నారు. గత 30 ఏళ్లుగా రోజూ అదే డ్యూటీ చేస్తూ ఏ మాత్రం కొత్తదనం లేకుండానే కొలువు నుంచి పదవీ విరమణ చేస్తున్నారు. అయితే ఆర్టీసీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టు అయిన టీఐ-2 గా కొలువు సాధించిన వాళ్లు క్రమం తప్పకుండా పదోన్నతులు పొందుతూ ఎస్‌టీఐ, సీఐ, డీఎం, డిఫ్యూటీ ఆర్‌ఎం, ఆర్‌ఎం, ఈడీ స్థాయి వరకు చేరుకుని రిటైరవుతున్నారని కార్మిక సంఘాల నేతలు వాపోతున్నారు.
పై స్థాయిలో పనిచేసే అధికారులు కనీసం 5 నుంచి 7 స్థాయిల వరకు పదోన్నతులు పొందుతుంటే కిందిస్థాయి వారికి కనీసం ఒక్కటంటే ఒక్క ప్రమోషన్ అయినా ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు. 1994లో టీఐగా జాయిన్ అయిన ఓ అధికారి ఈడీ స్థాయిలో రిటైరయ్యారని.. అప్పుడే జాయిన్ అయిన కండక్టర్ మాత్రం కండక్టర్‌గానే పదవీ విరమణ చేయాల్సి వచ్చిందని ఓ కార్మికుడు తెలిపారు.
ప్రమోషన్లు లేకుంటేనేం.. ఇంక్రిమెంట్లు ఇస్తున్నాం కదా..
ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్ తదితర కార్మికులకు నిబంధనల మేరకు కొలువులో చేరిన 12 ఏళ్ల లోపు ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఖాళీలు లేవనే సాకుతో పదోన్నతుల మాటే లేకుండా చేసింది యాజమాన్యం. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ ఇవ్వకపోయినా కనీసం ఇంక్రిమెంట్ అయినా ఇవ్వాలని గతంలో యూనియన్లు గట్టిగా పోరాటం చేయడంతో ఇంక్రిమెంట్ ఇచ్చారు.
12 ఏళ్ల తర్వాత ఒకటి... 20 ఏళ్ల తర్వాత మరొకటి ఇంక్రిమెంట్ ఇచ్చి సంతోషపడమని చెప్పే విధంగా యాజమాన్యం తీరున్నదని కార్మికులు అంటున్నారు. గతంలో ప్రమోషన్ల కోసం ఖాళీలు లేవని చెప్పిన యాజమాన్యం.. ఇప్పుడు క్లియర్ వేకెన్సీలు ఉన్నా కూడా ప్రమోషన్ల మాటెత్తడం లేదని చెబుతున్నారు. పోనీ తమ సమస్యలను అడిగేందుకు పోదామంటే ట్రేడ్ యూనియన్లకు గుర్తింపు లేకుండా చేశారని కార్మికులు అంటున్నారు. యాజమాన్యం ఒంటెద్దుపోకడలకు పోతోందని విమర్శిస్తున్నారు.
స్టాఫ్ సరిపోక తప్పని ఇబ్బందులు
ఏటా దాదాపు 2వేల మంది కార్మికులు కనీసం ఒక్కటంటే ఒక్క పదోన్నతి లేకుండానే రిటైరై పోతున్నారు. వారి స్థానంలో నియామకాలు చేపట్టడమే లేదు. గత పదేళ్లుగా ఇదే పరిస్థితి. ఫలితంగా డిపోల్లో కార్మికుల కొరత ఏర్పడుతోంది. దాంతో ఒక్కో డిపోల్లో 30 జతల డ్రైవర్లు, కండక్టర్లకు నిత్యం డబుల్ డ్యూటీలు వేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.
అన్ని డిపోల్లో ఖాళీలు భారీగా ఉన్నా కూడా పదోన్నతులు ఇవ్వడం లేదని, కొత్తగా నియామకాలు చేపట్టడం లేదని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. గతంలో ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ అంటే కేవలం స్వీపర్లు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు అన్నిస్థాయిల్లోనూ థర్డ్ పార్టీ ఔట్‌సోర్సింగ్ విధానం తీసుకువస్తున్నారని ఫలితంగా ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోందని కార్మికులు పేర్కొంటున్నారు.
అధికారులకు ముందు రోజే ప్రమోషన్ తీసుకుంటరు
ఆర్టీసీలో కార్మికులకు ఓ న్యాయం, అధికారులకు మరో న్యాయం కల్పిస్తున్నారు. 30 ఏళ్లు దాటుతున్నా కార్మికులకు పదోన్నతులు లేవు. అయితే ఓ అధికారికి మాత్రం రేపు ఖాళీ అయ్యే పోస్టుకు ముందు రోజే పదోన్నతి ఇస్తున్నారు. ట్రేడ్ టెస్టులు పెట్టి పదోన్నతులు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదు.
మియాపూర్, ఉప్పల్ వర్క్‌షాపులలో వేకెన్సీలు ఉన్నా కూడా పదోన్నతులు ఇవ్వనే లేదు. పదోన్నతుల కోసం కనీసం ట్రేడ్ టెస్టులు కూడా పెట్టడం లేదు. రెగ్యులర్ నియామకాలు ఆపేసి అంతా థర్డ్ పార్టీ ఔట్ సోర్సింగ్ వైపు వెళ్తున్నారు. ప్రైవేటీకరణ కోసం జరుగుతున్న ప్రయత్నంలోనే కార్మికులకు పదోన్నతులు రావడం లేదు.
థామస్ రెడ్డి, టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది
ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్, మెకానిక్, తదితర కార్మికులకు 30 ఏళ్లు అవుతున్నా ప్రమోషన్లు లేవు. నేరుగా నియామకమయ్యే వారికి మాత్రం పదోన్నతులు లభిస్తున్నాయి. ఏ చట్టమైనా, నిబంధన అయినా అందరికీ సమాన న్యాయం చేయాలనే చెబుతుంది. కానీ ఆర్టీసీలో మాత్రం ఇలాంటి నిబంధనలను ఏ మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు.
ఇప్పటికైనా యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి దీర్ఘకాలికంగా పదోన్నతులు లేకుండా పనిచేస్తున్న కార్మికులకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలి. 2014లో ఏడీసీగా ప్రమోట్ అయిన వ్యక్తి ఇంకా ఏడీసీగానే ఉన్నారు. 5 ఏళ్లలోపు పదోన్నతి కల్పించాల్సి ఉన్నా ఇవ్వడం లేదు.
మర్రి నరేందర్, ఎన్‌ఎంయూ రాష్ట్ర నేత