28 March, 2026 | 3:01 AM

అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం

28-03-2026 01:08 AM

పాల్గొన్న పీఠాధిపతులు 

జహీరాబాద్, మార్చి 27 : శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం అంగరంగ వైభోగంగా నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ , న్యాల్కల్, ఝరాసంగం, జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో సీతారాముల కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు, జహీరాబాద్ మండలంలోని కొత్తూరు బి గ్రామంలోని రామ మందిరంలో వివిధ గ్రామాలకు చెందిన రామభక్తులు హాజరై సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. 

జహీరాబాద్ రామ మందిరంతో పాటు శివాలయం వద్ద సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో జహీరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు భక్తులు పాల్గొన్నారు. జరా సంఘం మండలంలోని ఏడాకులపల్లి బర్దిపూర్ కుప్పా నగర్ గ్రామాలలో శ్రీరాముల వారి కళ్యాణాన్ని నిర్వహించారు ఆయా గ్రామాలలోని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో రామ భజన చేస్తూ ఊరేగింపులు పల్లకి సేవలు నిర్వహించారు. గురువారం రాత్రి జహీరాబాద్ లోని ప్రధాన వీధుల గుండా రామ భక్తులు పల్లకి సేవ శోభాయాత్ర నిర్వహించారు.

ఈ శోభాయాత్రలో పట్టణంలోని ప్రముఖులు పల్లకి సేవలో పాల్గొని స్వామి వారికి దర్శించుకున్నారు. కళ్యాణ మహోత్సవానికి బర్దిపూర్ ఆశ్రమపీఠాధిపతి సిద్దేశ్వరానందగిరి మహారాజ్, మల్లన్న గట్టు బసవలింగ మహారాజ్ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తులకు రామచంద్రుని జీవిత చరిత్రను వివరించి శ్రీరామచంద్రుని అడుగుజాడల్లో నడుచుకోవాలని సూచించారు. ఏడాకులపల్లిలో రామభక్తుడు నారాయణ గౌడ్ దంపతులు నిర్మించిన శ్రీ రామచంద్ర మందిరం వద్ద అంగరంగ వైభోగంగా కళ్యాణం నిర్వహించారు. కుప్పా నగర్ లో హౌస్ అది నరేష్, సురేష్ టీచర్, నర్సింలు, వేణు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఖేడ్‌లో..

నారాయణఖేడ్, మార్చి 27:  నారాయణఖేడ్ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన పురాతన రామాలయ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీరామునికి డోలయాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అంతర్గం ఆశ్రమ పీఠాధిపతి కరణ్ భారతి గజేంద్ర మహారాజ్ భక్తులకు ప్రత్యేక ప్రవచనాలను అందించారు.

వేడుకల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి దంపతులు, మున్సిపల్ చైర్మన్ నగేష్ శెట్కార్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి దంపతులు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగాయి. వేడుకల్లో భాగంగా స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు వ్యాపారవేత్తలు, మహిళలు, ప్రజలు , పెద్ద సంఖ్యలో హాజరై పాల్గొన్నారు.