22 April, 2026 | 1:35 AM

ప్రాణాలపై పరుగులు తీస్తున్న లారీలు!

22-04-2026 12:00 AM
  1. అధికారుల మౌనం.. ప్రమాదాలకు గ్రీన్ సిగ్నల్
  2. షార్ట్కట్ రోడ్డుతో ప్రజలపై నేరుగా ముప్పు

జిన్నారం/ అమీన్ పూర్, ఏప్రిల్ 21 : గడ్డపోతారం మున్సిపాలిటీ కేంద్రంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా పరిశ్రమ వాడకు సంబంధించిన భారీ లారీల రాకపోకలు స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. రహదారులపై పెద్ద వాహనాల అధిక రాకపోకల వల్ల చిన్న వాహన దారులు, ద్విచక్ర వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు.

ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు పరిశ్రమలకు సరుకులు తరలించే భారీ ట్రక్కులు, లారీలతో రోడ్లు నిండిపోతున్నాయి. ఇవి అధిక వేగంతో ప్రయాణించడం, నియంత్రణ లేకుండా మలుపులు తిప్పడం వల్ల ప్రమా దాల ముప్పు పెరుగుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లే ప్రజలు, మహిళలు ఈ పరిస్థితుల్లో రోడ్డు దాటడానికే భయపడుతున్నారు.

అయితే పరిశ్రమల కోసం ప్రత్యేకంగా కేటాయించిన మార్గం ఉన్నప్పటికీ, చాలా వాహనాలు షార్ట్కట్ కోసం మున్సిపాలిటీ ప్రధాన రోడ్లను వినియోగిస్తున్నాయి. దీంతో నివాస ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగి, శబ్ద కాలుష్యం, గాలి కాలుష్యం కూడా అధికమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చిన్నపాటి ప్రమాదాలు జరిగినప్పటికీ, అధికారులు పెద్దగా స్పందించలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు పలు కీలక డిమాండ్లు చేస్తున్నారు. పరిశ్రమ వాహనాలు కేటాయించిన మార్గాల్లోనే వెళ్లేలా కఠిన చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీ కేంద్రంలో భారీ వాహనాల ప్రవేశంపై పరిమితులు విధించాలని, ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షణ పెంచాలని, స్పీడ్ నియంత్రణ చర్యలు మరియు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.