20-01-2026 12:00:00 AM
మఠంపల్లి, జనవరి 19: జాతీయ రోడ్డు భద్రత మాసం సందర్భంగా మఠంపల్లి మండలంలోని సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో లారీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం రవాణా శాఖ ఆధ్వర్యంలో సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ సహకారంతో నిర్వహించారు. కార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ జిలానీ షేక్ మాట్లాడుతూ,భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యమే ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని, అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం, అలసటతో డ్రైవింగ్ చేయడం వంటి అలవాట్లు ప్రాణాంతకంగా మారుతున్నాయని హెచ్చరించారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,నిద్రమత్తు లేదా అలసటగా ఉన్నప్పుడు వాహనం నడపకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ జి.ఆర్.చరణ్,లక్స్మా రెడ్డి,గడ్డం రవి కుమార్ (సేఫ్టీ మేనేజర్), అలాగే సాగర్ సిమెంట్స్ ఫ్యాక్టరీ సిబ్బంది పాల్గొన్నారు.