20-01-2026 12:00:00 AM
సూర్యాపేట, జనవరి 19 (విజయక్రాంతి): హుజుర్‌నగర్ నియోజకవర్గ పరిధి లోని పాలకీడు మండలం జానపహాడ్‌లో జవహర్ జాన్‌పహాడ్ ఎత్తిపోతల పథకాల విస్తరణ పనులకు పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు అయ్యాయని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. ఆదివారం మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించిందని చెప్పారు.
ఐదు ప్రాజెక్టుల నిర్మాణానికి గాను గతంలో రూ.447 కోట్ల తో ప్రణాళికలు రూపొందించగా తదుపరి పెరిగిన ఆయకట్టుకు అనుగుణంగా ఆ మొత్తంను రూ.628.78 కోట్లకు పెంచినట్లు తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టులు పూర్తి అయితే 1,58,300 ఎకరాలకు సమృద్ధిగా సాగు నీరు లభిస్తుందన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ రైతాంగం కల సాకారం చెయ్యాలన్నదే తన తపన అని మంత్రి పేర్కొన్నారు. జానపహాడ్ ఎత్తిపోతల పథకానికి 2022 లో ప్రణాళికలు రూపొందించామని అయితే ఆయకట్టును 10,000 ఎకరాలకు విస్తరించాలన్న రైతాంగం ఆకాంక్ష మేరకు రూ.173 కోట్ల అంచనా వ్యయాన్ని రూ. 292.98 కోట్లకు పెంచాల్సి వచ్చిందన్నారు.
దీనికి మంత్రివర్గం ఆమోదించింద న్నారు. మొదట జాన్ పహాడ్ బ్రాంచ్ కెనాల్ 19.90 కిలోమీటర్ వద్ద నీటిని ఎత్తిపోతల ద్వారా టెయిల్ ఎండ్ ప్రాంతాల్లో సాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్న జానపహాఫ్, ఆలింగాపురం, బొత్తలపాలెం, కోమటికుంట, గుండ్లపహాడ్, గుండెబోయినగూడెం, మిగడంపాడు తండా, చెరువు తండా, రాఘవా పురం గ్రామాలకు చెందిన 5,650 ఎకరాలకు సాగు నీరు అందడంతో పాటు ఆరు చిన్ననీటి పారుదల ట్యాంక్ లకు ప్రయోజనం జరిగేదన్నారు.
రైతాంగం నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని అదనంగా మరో 4,350 ఎకరాలు కలిపి మొత్తం పదివేల ఎకరాలకు ఈ ఎత్తిపోతల పధకం విస్తరించడంతో ఎల్లాపురం, సజ్జాపురం, పాలకీడు, నాగిరెడ్డిగూడెం, హనుమయ్యగూడెంలతో పాటు గుడుకుంట్లపాలెంలకు నీరు అందుతుందని పేర్కొ న్నారు. వీటితో పాటు మరో 3 చిన్నతరహా నీటిపారుదల ట్యాంక్ లకు లబ్ది చేకూరనుందన్నారు. ఇప్పటికే పంప్ హౌజ్ నిర్మాణం తో పాటు ఫ్రెషర్ మెయిన్ లేవుట్ పనులు వేగవంతంగా కోనసాగుతున్నాయని 2026 ఖరీఫ్ నాటికి పూర్తి చేసేందుకు యుద్దప్రాతిపదికన పనులు సాగుతున్నాయన్నారు.
ఆర్ 9 విస్తరణ, ఎంబీసీ పునరుద్ధరణ
జవహర్ జానపహాడ్ ఎత్తిపోతల పథకంతో పాటె ఎన్‌ఎస్‌పి ఎడమ ప్రధాన కాలువపై ప్రతిపాదించిన ఆర్-9 ఎత్తిపోతల పథకం ద్వారా ప్రస్తుతం 1500 ఎకరాలు ఉండగా అదనంగా మరో 800 ఎకరాల ఆయకట్టును కలిపి మొత్తం 2300 ఎకరాల సాగునీరు అందించేందుకుగాను అనుమతులు వచ్చాయని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. దీని ద్వారా కోదాడ నియోజకవర్గ పరిధిలోని బరఖాత్ గూడెం, కృష్ణానగర్, ఆకుపాములలతో పాటు రామాపురం, ఇకేపెట్ తండా గ్రామాల రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు లభిస్తుందన్నారు.
అదే విదంగా హుజుర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని 1,08,000 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించబడిన ముక్త్యాల బ్రాంచ్ ను పునరుద్ధరించడంతో పాటు ఆధునీకరణ చేసేందుకు గాను రూ.222.22 కోట్లకు ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. ఎన్‌ఎస్ ఎల్‌బిసి మెయిన్ కెనాల్ 70.560 నుండి 115.400 కిలోమీటర్ వరకు చేపట్టిన లైనింగ్ తో పాటు ఇతర పునరుద్ధరణ పనులకు రూ.29.02 కోట్లు, హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలో 35,000 ఎకరాలకు ప్రయోజనం చేకూర్చనున్న జానపహాడ్ బ్రాంచ్ కెనాల్ లో మిగిలి పోయిన సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులకు గాను రూ.53.68 కోట్లకు అనుమతులు లభించినట్లు మంత్రి తెలిపారు.