calender_icon.png 20 January, 2026 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురపాలిక.. ఎవరిదో ఏలిక?

20-01-2026 12:00:00 AM

తిరుమలగిరి.. చైర్మన్ పీఠంపైనే అందరి గురి 

చైర్మన్ జనరల్ అభ్యర్థికి కేటాయించడంతో మరింత పెరిగిన డిమాండ్                               

ఒక్క ఛాన్స్ ప్లీజ్.. అంటూ టికెట్ కోసం ఫైరవీలు

రోజురోజుకు వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయాలు

తుంగతుర్తి, జనవరి 19: తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపాలిటీలో గత ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. మున్సిపాలిటీలో  మొత్తం 15 వార్డులు ఉండగా బీఆర్‌ఎస్ 11, కాంగ్రెస్ 4 వార్డుల్లో విజయం సాధించాయి. దీంతో బీ ఆర్ ఎస్ చైర్మన్ పీఠమును కైవసం చేసింది. ఎస్సీకి రిజర్వ్ కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన బి ఆర్ ఎస్ కు చెందిన రజినిని చైల్ పర్సన్ గా ఎన్నుకున్నారు.

తదుపరి 2023లో సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోనికి రాగానే బీఆర్‌ఎస్ లో గెలిచిన కొంతమంది కౌన్సిలర్ లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నాటి ఛైర్ పర్సన్ రజిని వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులతో చేతులు కలిపి ఆమెపై అవిశ్వాసం తీర్మానం పెట్టారు. దీంతో మరో ఏడాది పదవీకాలం ఉండగానే రజిని తన పదవికి రాజీనామా చేసింది. తదుపరి 8వ వార్డులో బిఆర్‌ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన కౌన్సిలర్ శాగంటి అనసూయ ను ఛైర్ పర్సన్ అయ్యారు. అయితే ప్రస్తుతం రిజర్వేషన్ లు ప్రకటించడంతో ఆశావాహులు పోటీకి సిద్ధమవుతున్నారు.

ముదిరిన ఎన్నికల వేడి 

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించడంతో మరో మారు ఎన్నికల వేడి పెరిగింది. మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీల తరఫున అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితాను సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలను కూడా అధికారికంగా ప్రకటించారు. తిరుమలగిరి మున్సిపల్ పరిధిలో 15 వార్డులు ఉండగా 15,455 మంది ఓటర్లు ఉండగా 7,638 మంది పురుషు, 7,817 మహిళా  ఓటర్లు ఉన్నారు.

వార్డుల వారీగా రిజర్వేషన్ లు ఇలా.. 

1వ వార్డు జనరల్ మహిళ, 2వ వార్డు బీసీ, 3వ వార్డు ఎస్సీ, 4వ వార్డు బీసీ మహిళ, 5వ వార్డు జనరల్, 6వ వార్డు జనరల్ మహిళకు కేటాయించారు. అలాగే 7వ వార్డు బీసీ, 8వ వార్డు జనరల్ మహిళ, 9వ వార్డు జనరల్గా నిర్ణయించారు. మిగతా వార్డుల్లో 10వ వార్డు ఎస్టీ, 11వ వార్డు జనరల్ మహిళ, 12వ వార్డు ఎస్సీ మహిళ, 13వ వార్డు జనరల్ మహిళ, 14వ వార్డు జనరల్, 15వ వార్డు ఎస్సీకి రిజర్వ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ కు కేటాయించారు.

టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు

పురపాలక సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు నుండే ప్రయత్నాలు మొదలుపెట్టిన వారు రిజర్వేషన్లు ఖరారు అయ్యేసరికి టికెట్ల కోసం ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల మంత్రులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ఎంపీ నివాసాల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. టికెట్లు ఆశిస్తున్న నాయకులు వారి అనుచరులతో వారి నివాసాలు కిటకిటలాడుతున్నట్లు ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు. కొందరైతే కుల సంఘాలు, కాలనీ పెద్దమనుషులను వెంటబెట్టుకొని వచ్చి వారితో టిక్కెట్ కావాలని అడిగిస్తున్నట్లు తెలుస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బిసి, జనరల్ అన్ని స్థానాలలో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.

చైర్మన్ జనరల్ తో వేగంగా మారుతున్న సమీకరణాలు 

తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ పదవిని అన్రిజరవ్డ్ (జనరల్)గా ప్రకటించడంతో పట్టణ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ నిర్ణయంతో అన్ని సామాజిక వర్గాలకు చెందిన నేతలు పోటీ బరిలోకి దిగే అవకాశం లభించడంతో రాజకీయ పోరు మరింత తీవ్రంగా మారింది. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఆశావహులు ఒక్కసారిగా చురుగ్గా మారి, తమ బలాబలాలను పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీల్లో టికెట్ల కోసం అంతర్గత పోటీ ఉధృతమవుతుండగా, కీలక నేతల మద్దతు కోసం లాబీయింగ్లు వేగం పుంజుకున్నాయి. తిరుమలగిరి మున్సిపల్ రాజకీయాలు ఇకపై మరింత వేడెక్కనున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒక్కో వార్డు నుంచి 10_15 మంది పోటీలు ఉండే అవకాశం ఉన్నందున ఖర్చు కూడా కోట్లలోకి మారే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది.

కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు.. 

మున్సిపాలిటీని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. పురపాలికలోని మొత్తం 15 వార్డులను గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ఉన్న తిరుమలగిరి, మోత్కూర్ రెండు మున్సిపాలిటీలు చేజిక్కించుకోవడానికి ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే  ఇటీవల కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడమే ఇందుకు నిదర్శనం.

మాజీ ఎమ్మెల్యేకు అనుకూలించేనా...? 

బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే  గాదరి కిషోర్ కుమార్ రెండు మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగురవేసేందుకు నాయకులతో నిరంతరం మంతనాలు జరుపుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆయన నియోజకవర్గ కేంద్రంలో  ప్రజలకు, కార్యకర్తలకు రైతులకు అందుబాటులో ఉండటం ఈ ఎన్నికల్లో అనుకూలంగా మారే అవకాశం ఉన్నట్లుగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా తిరుమలగిరి పీఠమును ఎవరు దక్కించుకుంటారనేది తేలాలంటే ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఎదిరి చూడక తప్పదు.