తంగళ్లపల్లిలో ప్రేమ వివాదం
వాల్ పోస్టర్లతో ప్రియుడి వినూత్న నిరసన
తంగళ్లపల్లి, జూలై 8 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ప్రేమ వ్యవహారం కలకలం రేపింది. ఏడేళ్లుగా తనతో ప్రేమలో ఉన్న యువతికి కుటుంబ సభ్యులు వేరే యువకుడితో వివాహం నిశ్చయించారని ప్రియుడు ఆరోపిస్తూ.. అర్ధరాత్రి వేళ వాల్ పోస్టర్లు అతికిస్తూ వినూత్న నిరసన చేపట్టాడు. యువతి తనను ప్రేమిస్తున్నప్పటికీ బలవంతంగా పెళ్లి చేస్తున్నారని, కట్నం కోసం ఈ వివాహం జరుగుతోందని ఆరోపించాడు.
యువతితో కలిసి దిగిన ఫొటోతో పాటు వరుడి ఫొటో, అతని కుటుంబ వివరాలు, ఫోన్ నంబర్లతో పోస్టర్లు ముద్రించి తంగళ్లపల్లి ప్రధాన కూడళ్లు, వీధులు, గోడలపై అతికించాడు. ఉదయం గ్రామస్థులు పోస్టర్లు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. కారులో వచ్చి పోస్టర్లు అతికించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు సమాచారం.






